TSRTC Hikes Bus Fares in the Name of Diesel Cess - Sakshi
Sakshi News home page

మళ్లీ బుసకొట్టిన సెస్‌.. ఈసారి డీజిల్‌ సెస్‌ వడ్డించిన ఆర్టీసీ

Published Fri, Apr 8 2022 7:38 PM

TSRTC Hikes Bus Fares In The Name Of Diesel Cess - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వడంలో జాప్యం జరుగుతుండటం, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ తన స్థాయిలో సెస్‌లను ఎడాపెడా వడ్డిస్తోంది. ఇప్పటికే సేఫ్టీ సెస్, ప్యాసింజర్‌ ఎమినిటీస్‌ సెస్‌ పెంపుతో టికెట్‌ ధరలను సవరించిన ఆర్టీసీ తాజాగా డీజిల్‌ సెస్‌ విధించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 2 రూపాయలు, ఎక్స్‌ప్రెన్, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 5 రూపాయల చొప్పున సెస్‌ వడ్డించింది.

సూపర్‌ లగ్జరీ సహా ఇతర ఏసీ కేటగిరీ సర్వీసుల్లో ఈ సెస్‌ పేరుకు 5 రూపాయలుగానే నిర్ధారించినా వాటిల్లో టికెట్‌ ధరలు రూ. 10 గుణిజంతో ఉన్నందున ప్రభావం నేరుగా రూ. 10గా ఉండనుంది. టికెట్‌ బేస్‌ ధరపై ఈ సెస్‌ను విధించి చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని రౌండ్‌ ఆఫ్‌ చేసింది. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సుల్లో ధరను సమీపంలోని రూ. 5కు రౌండాఫ్‌ చేయగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ ఇతర సర్వీసుల్లో దాన్ని తదుపరి రూ. 5కు పెరిగేలా రౌండాఫ్‌ చేశారు.

సూపర్‌ లగ్జరీ, ఇతర ఏసీ కేటగిరీల్లో దాన్ని తదుపరి రూ. 10కి రౌండాఫ్‌ చేశారు. నిజామాబాద్‌ టూర్‌కు వెళ్లిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అక్కడ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. శనివారం తొలి సర్వీసు నుంచి డీజిల్‌ సెస్‌ అమల్లోకి తేనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

రూ. 100 కోట్ల భారం..
ఈ కొత్త సెస్, దాని రూపంలో టికెట్‌ చార్జీని రౌండ్‌ ఆఫ్‌ చేయడం... వెరసి ఆర్టీసీకి సాలీనా రూ. 100 కోట్ల అదనపు రాబడి సమకూరనుంది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ వడ్డించిన సెస్‌లు, ఇతర రౌండింగ్‌ ఆఫ్‌ సవరింపులతో జనంపై వార్షికంగా రూ. 350 కోట్ల అదనపు భారం పడినట్టయింది. ఇక ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న టికెట్‌ ధరల పెంపు ప్రతిపాదన అమలులోకి వస్తే సాలీనా మరో రూ. 900 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది.

పెంపు భారం ఇలా..
పల్లెవెలుగు బస్సుల్లో 15 కి.మీ.తర్వాత (మూడో స్టేజీ) రూ.15గా ఉన్న టికెట్‌ ధర రూ.20గా, 20 కి.మీ. తర్వాత రూ. 20 టికెట్‌ రూ. 25గా, ఇలా ఐదు చొప్పున పెరుగుదల నమోదవుతుంది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి కనీస టికెట్‌ చార్జీ రూ.10 నుంచి రూ. 15కు పెరుగుతుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ. 15 నుంచి రూ. 20కి, మెట్రో డీలక్స్‌లో రూ. 20 నుంచి రూ. 25కు పెరుగుతుంది. జిల్లా ఏసీ కేటగిరీల్లో రూ.10 మేర పెరుగుదల నమోదవుతుంది. 

చదవండి: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

Advertisement
Advertisement