కేరళ నాయర్లూ... రాజస్థాన్‌ గుజ్జర్లూ చుట్టాలే! | Sakshi
Sakshi News home page

కేరళ నాయర్లూ... రాజస్థాన్‌ గుజ్జర్లూ చుట్టాలే!

Published Mon, Jan 1 2024 6:49 PM

New study sheds light on genetic affinities of Gujjars and Kerala Nair - Sakshi

కేరళలో ఉన్న నాయర్లకు.. రాజస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా? ఈ రోజు ఇరువురికీ మధ్య అస్సలు సంబంధం లేకపోవచ్చునేమో కానీ.. ఒకప్పుడు మాత్రం ఇద్దరు దగ్గరి చుట్టాల్లాంటి వారు అంటోంది సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వారని వీరు జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించారు. కొంచెం వివరంగా చూస్తే.. 

భారత దేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్‌ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు.

మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్‌ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్‌ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి.

సెక్స్‌ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) గుర్తించారు. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్‌ (ఐశ్వర్యరాయ్‌ బంట్‌ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది.

‘‘నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్‌, గుజ్జర్‌ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరిలో ఇరాన్‌ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ తెలిపారు. అంతేకాకుండా... తల్లివైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోందని దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని ఆయన వివరించారు.

‘జినోమ్‌ బయాలజీ అండ్‌ ఎవల్యూషన్‌’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనపై సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి మాట్లాడుతూ భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement