దళిత మహిళా అధికారిపై టీడీపీ నేత సోమిరెడ్డి దూషణలు | Sakshi
Sakshi News home page

దళిత మహిళా అధికారిపై టీడీపీ నేత సోమిరెడ్డి దూషణలు

Published Sun, Dec 10 2023 5:26 AM

TDP leader Somireddy abuses Dalit women officer - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ccపొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ దళిత మహిళా అధికారిపై దూషణలు చేయడంతో దళిత, గిరిజన వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆ అధికారికి  ఫోన్‌ చేసి వ్యక్తిగత దూషణలకు దిగిన ఆడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఓ సీనియర్‌ రాజకీయ నేతగా సమాజంలో హుందాగా ఉండాల్సిన వ్యక్తి తన స్థాయి మరిచి ప్రవర్తించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సోమిరెడ్డి అనుచరుడు కేసీ పెంచలయ్య గత టీడీపీ పాలనలో ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.8 లక్షల విలువైన టాటా ఇండికా వాహనాన్ని రాయితీపై పొందారు. దానికి రూ.లక్ష వరకు రాయితీ వస్తుండగా, మిగతాది ప్రతి నెలా రూ.15 వేలు కంతు చెల్లించాల్సి ఉంది. ఇలా కంతులు చెల్లించుకుంటూ ఐదేళ్లలో పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంది. కానీ గిరిజన సంఘం నేత ఇప్పటికి కేవలం రూ.60 వేలే చెల్లించాడు.

ఆరేళ్లు పూర్తి కావస్తున్నా వాహన కంతులు చెల్లించకపోవడంతో ఐటీడీఏ అధికారులు పలుమార్లు నోటీసులిచ్చారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల కిందట వాహనాన్ని సీజ్‌ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ మంత్రి.. ఐటీడీఏ పీవో మందా రాణికి ఫోన్‌ చేసి వ్యక్తిగత దూషణలకు దిగారు. నువ్వు.. అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ దూషించారు. సోమిరెడ్డి దూషణతో మనస్తాపం చెందిన ఆమె జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు.  

సోమిరెడ్డి తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన గిరిజన సంఘాలు
దళిత అధికారిపై వ్యక్తిగత దూషణలు చేసిన సోమిరెడ్డి తీరును నిరసిస్తూ శనివారం దళిత, గిరిజన సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేశాయి. ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘ నేత పాలకీర్తి రవి మాట్లాడుతూ కుల సంఘం ముసుగులో సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తి వాహన కంతులు చెల్లించకుండా విలాస జీవితం గడుపుతున్నారని విమర్శించారు. తన మద్దతుదారుడి వాహనం సీజ్‌ చేస్తే అదేదో ఘోరం జరిగినట్టు మహిళా అధికారిపై ఫోన్‌లో బెదిరింపులకు దిగి నానా యాగీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement