భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర

భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జియోగ్రాఫికల్ ఇండికేషన్స్(భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇకత్, మైసూర్ సిల్క్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, బికనీర్ భుజియా, గుంటూరు సన్నమ్ చిల్లి, హైదరాబాద్ హలీమ్.. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందట. అందుకే వీటిని విక్రయించేందుకు  ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలూ ముందుకొస్తున్నాయి.

 

 ‘విలువైన’ గుర్తింపు..: భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. రాజస్తాన్‌లోని బికనీర్‌లో తయారైన భుజియాకు గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో 10% ప్రీమియం లభిస్తోందట. బికనీర్ భుజియా తయారీలో సుమారు 25 లక్షల మంది ఆధారపడ్డారు. కుటీర పరిశ్రమగా ఉన్న బికనీర్ భుజియాకు పెప్సితోపాటు దేశీ కంపెనీల నుంచి పోటీ తలెత్తింది. చివరకు 2010 సెప్టెంబర్‌లో భారత పేటెంటు కార్యాలయం జీఐ ధ్రువీకరణ ఇచ్చింది. బికనీర్ భుజియా పేరును ఆ ప్రాంత తయారీదారులుకాక మరెవరూ వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్(రిజిస్ట్రేషన్, ప్రొటెక్షన్)చట్టం-1999 రక్షణ కల్పిస్తోంది. జీఐ ధ్రువీకరణ ఉన్న ఏ ఉత్పత్తికైనా  రక్షణ ఉంది. తిరుపతి లడ్డూ లాంటి లడ్డూ అని విక్రయిస్తున్న చెన్నై వ్యాపారిపై కేసు నమోదైంది కూడా.

 

 5 వేల ఉత్పత్తులు..: దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉన్న ఉత్పత్తులు సుమారు 1,000కి పైగా ఉంటాయి. ఇందులో భౌగోళిక గుర్తింపు నమోదు కోసం 450 (ఇతర దేశాల్లో 100 కలుపుకుని) దరఖాస్తులు చెన్నైలోని జీఐ రిజిస్ట్రీకి వచ్చాయి. వీటిలో 195 ఉత్పత్తులు ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60 దాకా ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో 30 దరఖాస్తులు రాగా, 22 ఉత్పత్తులకు ధ్రువీకరణ లభించింది. బంగినపల్లి మామిడి, దుర్గి స్టోన్, మచిలీపట్నం ఇమిటేషన్ జువెల్లరీ, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం చీరలు, హైదరాబాద్ బిర్యానీ, బనగానపల్లె మామిడి, బందరు లడ్డు, నిజామాబాద్ నల్ల మట్టి పింగాణి తదితర ఉత్పత్తులు జీఐ కోసం ఎదురు చూస్తున్నాయి. దేశీయ కళాకారులను ప్రోత్సహిస్తూ, వారి ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆన్‌లైన్ సంస్థ క్రాఫ్టిసన్.ఇన్ రాష్ట్రంపైనా ఆసక్తి కనబరుస్తోంది. త్వరలో ఇక్కడి తయారీదారులతో చేతులు కలపనుంది.

 

 అవకాశాలు అందుకోండి..

జీఐ ఉత్పత్తుల విక్రయానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ప్రమోషన్ సెంటర్(ఏపీటీడీసీ) సూచిస్తోంది. జీఐ ఉత్పత్తులకు కస్టమర్లు విలువిస్తున్నారని, వ్యాపార అవకాశాలను అందుకోవాలని ఏపీటీడీసీ డెరైక్టర్ ఎస్.జ్యోతి కుమార్ సోమవారమిక్కడ సీఐఐ సదస్సు సందర్భంగా తెలిపారు. ఈ ఉత్పత్తులను విక్రయించాలనుకునే వారు స్వల్ప రుసుముతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఐపీఆర్ కౌన్సిలర్ సుభజిత్ సాహా తెలిపారు. వ్యాపారులకు అవగాహన  కోసం త్వరలో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top