మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు! | Sakshi
Sakshi News home page

మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!

Published Sat, Aug 12 2017 1:13 PM

మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!

గోరఖ్‌ పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృత్యుఘోషతో పరిస్థితి భయానకంగా ఉంది. ఇప్పటికే 63 మంది పిల్లలు చనిపోగా, తీవ్ర విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన సీఎం ఆదిత్యనాథ్‌ మంత్రుల బృందాన్ని రంగంలోకి దించారు. ఆక్సిజన్‌ సరఫరా పునరుద్ధరణ చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. బాధిత తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. కళ్లముందే కన్నబిడ్డలు పిట్టల్లా రాలిపోయిన వేదన వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఎవరినీ కదిలించినా గుండెలు పిండేసేరీతిలో తమ గోడు వ్యక్తం చేస్తున్నారు.  

'పది రోజుల వయసున్న మా అబ్బాయికి నియో నేటల్‌ వార్డులో చికిత్స అందించారు. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. రక్తం, మందులు కావాలని వైద్యులు కోరారు. వాటి కోసం వెళ్లి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడు. ఆ అరగంటలో ఏం జరిగిందో తెలియదు' అంటూ దీపక్‌ చంద్‌ అనే వ్యక్తి విలపిస్తూ చెప్పాడు.

చనిపోయిన పిల్లల్ని చూడనివ్వకుండా వైద్యులు అడ్డుకుంటున్నారని, నిలదీస్తే సిబ్బంది చెయ్యి చేసుకున్నారని మృత్యుంజయ్‌ అనే మరో వ్యక్తి ఆరోపించాడు. కావాలంటే సీసీ పుటేజీలను పరిశీలించాలని కోరుతున్నాడు.   



'ఉదయం నుంచి వార్తల్లో ఆక్సిజన్‌ అందకే పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం. కానీ, అందులో నా కూతురు కూడా ఉంటుందనుకోలేదు' అని చనిపోయిన ఏడేళ్ల జ్యోతి అనే చిన్నారి తల్లి సరోజా దేవి ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర జ్వరం, వాంతులు చేసుకోవటంతో మంగళవారం జ్యోతిని ఆస్పత్రిలో చేర్పించామని, హఠాత్తుగా పరిస్థితి విషమించిందని కూతురు శవాన్ని తమ చేతుల్లో పెట్టారని ఆమె గోళ్లుమంది.

ఇక అమైరా అనే తల్లిది మరో వేదన. 'జలుబుతో బాధపడుతున్న నా కూతురు జీవచ్ఛవంలా పడి ఉంది. కాస్త వచ్చి చూడండయ్యా బతిమాలుకుంటున్నా వైద్యులు ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా భగవంతుణ్ణి ప్రార్థించాడంటూ సలహాలు ఇస్తున్నారు' అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది.

ఇలా బీఆర్డీ ఆస్పత్రిలో ఏ తల్లిదండ్రులను కదిలించినా ఇలాంటి కన్నీటి వ్యధలు వినిపిస్తున్నాయి. చిన్నారుల శవాలను చేతులతో మోసుకొస్తున్న తల్లిదండ్రుల దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.

Advertisement
Advertisement