మళ్లీ పేచీ! | Sakshi
Sakshi News home page

మళ్లీ పేచీ!

Published Sun, Jun 21 2015 4:45 AM

second installment of the loan waiver

సాక్షి, సంగారెడ్డి: రైతుల రుణమాఫీపై ప్రభుత్వం మరో మడతపేచీ పెట్టింది. తొలివిడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము అర్హులైన ఖాతాల్లో జమ అయ్యాయని తేలాకే మలివిడత డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. తొలి విడత 25 శాతం రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) ఇచ్చినా ప్రభుత్వం సంతృప్తి చెందటంలేనట్లు తెలుస్తోంది. తొలివిడత డబ్బులు అర్హులైన రైతులకు చేరిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని  బ్యాంకర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల పరిశీలించేందుకు బ్యాంకర్ల బృందం   సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
 
 ఒక్కో ఆడిటింగ్ బృందంలో బ్యాంకు అధికారి, వ్యవసాయశాఖ, రెవెన్యూ, లోకల్ ఫండ్ ఆడిటింగ్, ట్రెజరీ అధికారులు ఉంటారు. వీరందరూ తమకు కేటాయించిన బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో 25 శాతం రుణమాఫీ డబ్బులు జమ చేశారా లేదా? అర్హులైన వారికే చేరాయా? ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తించిందా లేక ఎక్కువ మందికి వర్తింపజేశారా? తదితర అంశాలను పరిశీలిస్తారు. ఆడిటింగ్‌లో అనర్హులని తేలితే వారి పేర్లను రుణమాఫీ జాబితా నుంచి తొలగిస్తారు. జిల్లాలోని ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రా బ్యాంకు, డీసీసీబీ, గ్రామీణ వికాస్ బ్యాంకు తదితర ప్రధాన బ్యాంకులకు చెందిన 30 బ్యాంకు శాఖల్లో ఈనెల 29వ తేదీ వరకు ఆడింటింగ్ నిర్వహించనున్నారు. ఆడిటింగ్ నివేదికలను పరిశీలించాకే ప్రభుత్వం రెండో విడత రుణమాఫీపై నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాల సమాచారం. కాగా తొలివిడతగా 25 శాతం రుణమాఫీ సొమ్ము జమచేసి యూసీలు అందజేసినా ప్రభుత్వం తిరిగి ఆడిటింగ్‌కు ఆదేశించటంపై బ్యాంకర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
 రెండు విడతల్లో డబ్బులు విడుదల?
 జిల్లాలో రుణమాఫీ పథకం కింద 4,06,005 మంది రైతులు అర్హులుగా తేలారు. వీరికి సంబంధించిన రూ.2014 వేలకోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా ప్రభుత్వం 25 శాతం సొమ్ము రూ.503 కోట్ల విడుదల చేసింది. ఇందులో 3,96,191 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో రూ.483 కోట్లు జమ చేశారు. వేర్వేరు కారణాలతో అనర్హులుగా తేలిన రైతులకు సంబంధించిన రుణమాఫీ మొత్తం రూ.20 కోట్లను తిరిగి ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశారు. కాగా ప్రభుత్వం మలి విడత 25 శాతం రుణమాఫీ డబ్బు రూ.483 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రెండో విడత రుణమాఫీ సొమ్మును రెండు విడతల్లో విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో మడతపేచీ పెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 జాప్యంపై రైతుల్లో అసహనం
 రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయటంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ ప్రారంభం కావటంతో  రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు రుణమాఫీపై ఆడిటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడిటింగ్ ప్రక్రియ ద్వారా రుణమాఫీ పథకం నుంచి దూరం చేసేందుకు యత్నిస్తోందని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement