సానియాకు ఫ్రీ పబ్లిసిటీ | Sakshi
Sakshi News home page

సానియాకు ఫ్రీ పబ్లిసిటీ

Published Sat, Jul 26 2014 12:32 PM

సానియాకు ఫ్రీ పబ్లిసిటీ - Sakshi

బ్రాండ్ అంబాసిడర్ .. నిన్నమొన్నటి వరకూ ఓ మామూలు పదం. కానీ ఇప్పుడది అందరికీ విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. కోటి రూపాయలు ఇచ్చి మరీ ఒకరేమో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే, మరొకరేమో ఆ బ్రాండ్ అంబాసిడర్తో ఆ రాష్ట్రానికి కూడా ఇరవై కోట్ల విలువైన ఫ్రీ పబ్లిసిటీ చేశారు. విషయానికి వస్తే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. సానియాను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం పెను దుమారం రేపింది. జాతీయ రాజకీయాల్లో గత రెండు రోజులుగా వాడి, వేడి కామెంట్స్‌ దూసుకొచ్చాయి. జాతీయ మీడియాలోనూ హాట్‌ డిబేట్‌కు దారి తీసింది.

ముంబైలో పుట్టి పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ఎలా నియమిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌  తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై దీనిపై స్పందించిన సానియా తన తాత ముత్తాతలు హైదరాబాదీలే స్పష్టం చేసింది. తన జాతీయతను ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ టీవీ ఛానళ్లలో కంటతడి పెట్టి, కాసేపు ముక్కు కూడా చీదేసింది.

మరోవైపు సానియాను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అందుకోసం ఆమెకు కోటి ఇవ్వటం మాత్రం సరికాదని హైదరాబాదీవాసులే ఓ జాతీయ ఛానల్ లైవ్లో అభిప్రాయపడ్డారు. ఆ డబ్బును తెలంగాణ సర్కార్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇస్తే బాగుండేదని అన్నారు. బీజేపీ వ్యాఖ్యలతో అటు సానియాతో పాటు ఇటు తెలంగాణకు కూడా కావలసినంత ప్రచారం లభించినట్లు అయింది. దాంటో కోటి పోతే పోయింది.... ఇరవై కోట్ల విలువైన ప్రచారం లభించిందని టీఆర్ఎస్ నేతలు ఖుషీగా ఉన్నట్లు సమాచారం.

ఇక  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జా నియామకంతో ....అందుకు పోటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని డిమాండ్ తలెత్తింది. అందుకోసం పలువురు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు కరణం మల్లీశ్వరి, కోనేరు హంపి, చేతన్ ఆనంద్, వీవీఎస్ లక్ష్మణ్ తదితర క్రీడాకారులు మనకీ ఉన్నారంటూ గుర్తు చేస్తున్నారు. మరోవైపు సినీరంగానికి చెందిన వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement