ఎన్నికల అధికారుల హంగామా | Record the election of officers | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారుల హంగామా

Apr 26 2014 5:52 AM | Updated on Sep 17 2018 6:18 PM

ఎన్నికల అధికారులు తనిఖీల పేరిట హంగామా సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడమే గాక అనుచితంగా ప్రవర్తించి ఆనక ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

  •      ఉలిక్కిపడిన మాజీ డీజీపీ సెక్యూరిటీ సిబ్బంది
  •      సోదాల పేరిట హల్‌చల్..
  •      అధికారుల తీరుపై దినేశ్‌రెడ్డి సీరియస్
  •      బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో అనుచరుల ఫిర్యాదు
  •  కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఎన్నికల అధికారులు తనిఖీల పేరిట హంగామా సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడమే గాక అనుచితంగా ప్రవర్తించి ఆనక ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి శుక్రవారం కంటోన్మెంట్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు.

    ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో ప్రచారానికి కాస్త విరామం ఇచ్చి బాలంరాయిలో పార్టీ కంటోన్మెంట్ వార్డు-3 కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత శోభానాగిరెడ్డికి నివాళులు అర్పించి, తదుపరి ప్రచార సరళిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇంతలోనే ఓ అధికారిణి తలుపు నెట్టుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. లోపలికి వస్తూనే దినేశ్‌రెడ్డి సెక్యూరిటీ, అనుచరులను టార్గెట్‌గా చేసుకుని.. వెంటనే తలుపులు వేసి ఎవరూ బయటికి వెళ్లొద్దంటూ గద్దించారు.

    ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న దినేశ్ రెడ్డి గన్‌మెన్ వచ్చిన వారిని నక్సలైట్లుగా భావించి ఎదురుదాడికి సమాయత్తం అయినప్పటికీ దినేశ్‌రెడ్డి సూచనతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో తాను కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి లక్ష్మిని అంటూ ఆమె దినేశ్‌రెడ్డికి పరిచయం చేసుకున్నారు. ఇక్కడ డబ్బులు పంచుతున్నట్లు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు తనిఖీలు చేసేందుకు వచ్చామని చెబుతూ.. ఇల్లంతా సోదా చేశారు.

    వస్తువులన్నీ చిందరవందర చేశారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ సందర్భంగా అనవసరంగా తమ సమయాన్ని వృథా చేయడంతో పాటు, తన భద్రతకు విఘాతం కలిగే రీతిలో ప్రవర్తించడం సబబు కాదని దినేశ్‌రెడ్డి ఆమెను సుతిమెత్తగా హెచ్చరించారు. ముందుగా విషయం చెబితే తనిఖీలకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రత్యర్థి పార్టీల వాళ్లు చెప్పగానే అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు. ఈ విషయమై దినేశ్‌రెడ్డి ఆర్‌వో సుజాత గుప్తాకు ఫోన్ చేసి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
     
    ఎన్నికల సిబ్బంది అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు
     
    రసూల్‌పురా ః ఎన్నికల సిబ్బంది అనుచిత ప్రవర్తనపై వైఎస్సార్‌సీపీ కంటోన్మెంట్ 3వ వార్డు కన్వీనర్ కె. చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలంరాయిలో విలేకర్లతో మాట్లాడుతూ.. దినేష్ రెడ్డి రోడ్‌షోలో భాగంగా బాలంరాయిలో తమ ఇంటికి భోజనానికి రాగా.. తప్పుడు సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి లక్ష్మి నేతృత్వం లో సిబ్బంది హంగామా సృష్టించారన్నారు. ఇంట్లోకి వచ్చి బీరువాలోని వస్తువులు, బట్టలు కింద చిందరవంద రగా పడేసి, తమ ఆడవారిపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వారిపై బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
     
    విచారణకు ఆదేశించిన చంపాలాల్
     
    వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కంటోన్మెంట్ ఏరియా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మిపై విచారణకు ఆదేశించామని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంపాలాల్ తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకర ్గం పరిధిలో ఉన్నందున, విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుజాత గుప్తను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికను పరిశీంచిన అనంతరం తగిన చర్యలు చేపడతామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement