ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇకలేరు | Tamil film historian "Film News Anandan" passes away | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇకలేరు

Mar 22 2016 8:33 AM | Updated on Oct 2 2018 3:16 PM

ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇకలేరు - Sakshi

ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇకలేరు

సినిమా ఎన్‌సైక్లోపిడియా ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇక లేరు.

చెన్నై : సినిమా ఎన్‌సైక్లోపిడియా ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇక లేరు. తొమ్మిది దశకాల వయసు ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు సినీ కళామతల్లికి  సేవలందించిన అసలు పేరు ఆనందన్. చదువుకునే రోజుల్లోనే నటన, కథలు, సంభాషణలు రాయడం లాంటి అంశాలపై శ్రద్ధ చూపిన ఆనందన్‌కు ఫోటోగ్రఫీ అంటే అమితాసక్తి ఉండేది. అప్పట్లోనే మిక్సింగ్ ఫోటోలు తీయడంలో నైపుణ్యం పొందడంతో అది గ్రహించిన ప్రముఖ ఛాయాగ్రహకుడు సీజే మోహన్ స్టిల్ ఫోటోగ్రఫీలో మరింత మెరుగులు దిద్దించారు.
 
దీంతో ఒక స్టిల్ కెమెరాను కొనుక్కున్న ఆనందన్ సినిమా ఫోటోలను తీసి తన బాల్య స్నేహితుడు నిర్వహిస్తున్న ఫిల్మ్‌న్యూస్ పత్రికకు అందించేవారు. అలా ఆయన పేరు ఫిల్మ్‌న్యూస్ ఆనందన్‌గా వాసికెక్కింది. ఆ తరువాత ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ సినిమాలకు ప్రచార కర్తగా అవతారమెత్తారు. 1958లో దివంగత నటుడు, మక్కళ్ తిలగం ఎమ్జీఆర్ నటించిన నాడోడిమన్నన్ చిత్రం ద్వారా పీఆర్‌వోగా మారారు. విశేషమేమిటంటే అప్పటి వరకూ తమిళ  చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే పీఆర్‌వో అనే వృత్తి లేదు.
 
 ఇంకా చెప్పాలంటే ప్రపంచ సినీ చరిత్రలోనే తొలి పీఆర్‌వో ఫిలిం న్యూస్ ఆనందనేనట. సినిమానే జీవితంగా, శ్వాసగా పీల్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఫిలిం న్యూస్ ఆనందన్. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి ప్రఖ్యాత తెలుగు నటుల చిత్రాలకు పీఆర్‌వోగా పనిచేశారు. అలా పలు భాషలలో 1500 పైగా చిత్రాలకు  ప్రచార కర్తగా విశేష సేవలందించిన ఫిలిం న్యూస్ ఆనందన్ సినీ విక్కీపీడియా అనవచ్చు. నాటి టాకీ చిత్రాల నుంచి ఇటీవల విడుదలై డిజిటల్, 3డీ చిత్రాల వరకూ ఏ అంశం గురించి అయినా ఆనందన్ వద్ద కచ్చితమైన సమాచారం ఉంటుంది.
 
 సినిమాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా పరిశ్రమకు చెందిన వారు ఆయన్నే అడిగి తెలుసుకునే వారు. అందుకే ఫిలిం న్యూస్ ఆనందన్‌ను సినీ ఎన్ సైక్లోపిడియాగా పేర్కొంటారు. నాటి నుంచి నేటి వరకూ విడుదలై చిత్రాల వివరాలు, ఆయా చిత్రాల ఫోటోలను సేకరించి పదిల పరిచారాయన. అంతే కాదు సినిమాకు సంబంధించి మూడు పుస్తకాలను రచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రోత్సాహంతో సాధనై పడిత్త తమిళ్ తిరైపడ వరలారు పేరుతో పెద్ద గ్రంథాన్ని రాశారు. 1991లో రాష్ట్ర ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డుతో పాటు అనేక అవార్డులు, రివార్డులను అందుకున్న ఫిలిం న్యూస్ ఆనందన్ భీష్మ అవార్డుతోనూ సత్కరింపబడ్డారు.
 
 నిత్యకృషీవలుడుగా కీర్తించబడ్డ ఆనందన్ వయసు మీద పడడంతో ఇటీవల అనారోగ్యానికి గురైయారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిలిం న్యూస్ ఆనందన్‌కు భార్య శివకామి, కొడుకులు డైమండ్‌బాబు, రవి, కూతుళ్లు గీత, విజయ ఉన్నారు.

ఆయన పార్దివ శరీరాన్ని స్థానిక టీ.నగర్, పార్ధసారథిపురంలోని కొడుకు డైమండ్‌బాబు ఇంటి వద్ద సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఆనందన్ మృతికి ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నటుడు శివకుమార్, సూర్య, ప్రభు తదితర సినీ ప్రముఖులు ఫిలిం న్యూస్ ఆనందన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆనందన్ భౌతిక కాయానికి మంగళవారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement