ఎన్నికల కసరత్తు!


చెన్నై : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ  కసరత్తుల్ని ఎన్నికల యంత్రాంగం వేగవంతం చేసింది. అన్ని పార్టీలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో చెన్నైకు ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారుల బృందం రాబోతోంది. రాష్ట్ర అసెంబ్లీకి మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఓ వైపు రాజకీయ పక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమయ్యాయి. ఇక, ఎన్నికల నిర్వహణకు తగ్గ కసరత్తుల్ని ఈసీ రాజేష్ లఖానీ నేతృత్వంలోని అధికార యంత్రాంగం వేగవంతం చేసింది.

 

వరదల కారణంగా ఓటరు గుర్తింపు కార్డులు కోల్పోయిన వాళ్లకు కొత్త కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టారు. 15 వేల మంది దరఖాస్తులు చేసుకోవడంతో వారికి జనవరి మొదటి వారంలో కార్డులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీలతో సమాలోచనకు కసరత్తులు సాగుతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్ల మీద రాజేష్ లఖాని దృష్టి పెట్టి ఉన్నారు. ఒకే విడతగా ఎన్నికలు నిర్వహించాలా..? లేదా, రెండు విడతలుగానా..? అన్న కోణంలో ఈ సారి సమాలోచన సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి, కేరళ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం మేలో ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో ముం దస్తుగా ఇక్కడికి అవసరమయ్యే ఈవీఎం ల మీద సైతం దృష్టి పెట్టారు. బిహార్ తదితర ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి 75 వేల ఈవీఎంలను తమిళనాడుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందుగా జనవరి మొదటి లేదా, రెండో వారంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశాన్ని పూర్తి చేసి, ఎన్నికల నగారా మోగించేందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

 

ఇందు కోసం ఢిల్లీ నుంచి ఐదుగురు అధికారులతో కూడిన బృందం నెలాఖరులో లేదా, కొత్త సంవత్సరం వేళ చెన్నైకు రాబోతోంది. ఈ బృందం తొలి పర్యటన తదుపరి, పార్టీలతో సమాలోచన, తుది ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల నగరా ప్రక్రియ ..ఇలా అన్ని ఒకదాని తర్వాత మరొకటి సాగే విధంగా కార్యచరణను రాష్ట్ర ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top