తెలంగాణ స్వాతంత్య్రయోధుడు ‘కందిబండ’

తెలంగాణ స్వాతంత్య్రయోధుడు ‘కందిబండ’


మృత్యువు అంచుల్లోకి వెళ్లి చివరి క్షణంలో తప్పిం చుకుని స్వేచ్ఛా సమాజాన్ని చూసిన అరుదైన స్వాతంత్య్ర సమరయోధుడు కందిబండ రంగా రావు. నిజాం పాలనలో ఒక ముస్లిం హత్యకేసులో ఇరుక్కున్న ఆయనకు ఉరిశిక్ష పడే ప్రమాదం నుంచి మరొక ముస్లిం సాక్ష్యం కాపాడటం విశేషం. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం, సిరిపురం (కనకగిరి) గ్రామంలో 26-11-1907న రంగారావు జన్మిం చారు.



1927లో నిజాం కళాశాల నుంచి బి.ఏ. డిగ్రీ తీసుకుని ప్రజాసేవ చేయాలని భావించి సిరిపురం గ్రామంలో స్థిరపడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామాధికారివృత్తిలో, గ్రామ కరణంగా అధికార పనులను నిర్వర్తిస్తూండేవారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఇబ్రహీం అనే ఉప్పలమడక గ్రామస్తుని హత్య చేశారనే ఆరోప ణపై రంగారావును అరెస్టు చేశారు.



ఆయనను ఉరితీశారనే వార్త రావడంతో ఖమ్మం జిల్లా ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఆ వార్తను నమ్మిన ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు కూడా సిద్ధపడ్డారు. ఆయన పార్థివ శరీరాన్ని తీసుకొద్దామని వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనను ఉరి తీయ లేదని తెలియవచ్చింది. ఉరి తీయడానికి తీసుకెళ్లే ముందు నిజాం ప్రభుత్వంలో హోంశాఖ కార్య దర్శిగా పనిచేస్తున్న ఆయన క్లాస్‌మేట్ డా॥అహ్మద్ తన మిత్రుడిని ఉరితీయకుండా అడ్డుకు న్నట్టు తెలుసుకుని సంతోషించారు. విచారణలో హతుని భార్య తన భర్తను రంగారావు హత్య చేయ లేదని సాక్ష్యం ఇవ్వడంతో బతికిబయటపడ్డారు.



ఆరునెలల తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదల య్యారు. రంగారావు ఖమ్మం జిల్లాలో ప్రప్రథమ పట్టభద్రుడు. గ్రామ సర్పంచ్‌గా వైరా పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ గ్రామాధికారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులంతా పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తినటమే కాకుండా జైలుశిక్షలను అనుభవించారు. రంగారావు తన స్వగ్రా మమైన సిరిపురంలో 23-8- 1987న మరణించారు.

 

(కందిబండ రంగారావు 107వ జయంతి సందర్భంగా...)

 కె.ఇందిర  మెహదీపట్నం, హైదరాబాద్


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top