రైతు సంహార మార్గంలో మోన్‌శాంటో

రైతు సంహార మార్గంలో మోన్‌శాంటో - Sakshi


సందర్భం

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మొన్సాంటోకు వ్యతిరేకంగా "March against Monsanto'' పేరుతో ఉద్యమిస్తున్నారు. మోన్‌శాంటో ప్రజా స్వామ్య ప్రభుత్వాలను అవినీతిమయం చేసి, వినాశకరమైన జన్యు మార్పిడి విత్తనాలను, కాలకూట విషమైన కలుపుమందులను ప్రపంచ రైతాంగంపై రుద్డుతూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి, కుటుంబ కమతాలను నిర్వీర్యం చేసి లక్షలాదిగా రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.



ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జన్యు మార్పిడి వంగడాలను సృష్టించిన ఘనత కూడా మోన్‌శాంటోదే. అది ప్రపంచ విత్తన మార్కెట్‌ ను శాసించే స్థితికి చేరుకొంది. 1998లో ప్రపంచ బ్యాంకు మనపై రుద్దిన సరళీకృత విత్తన విధానంతో మన దేశంలోకి అడుగు పెట్టిన మోన్‌శాంటో పత్తి విత్తనాలపై గుత్తాధిపత్యాన్ని సాధించింది. దేశంలో  ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో అత్యధిక శాతం మంది బి.టి. పత్తి పండించిన రైతులే.



మన దేశంలో సగటు పత్తి దిగుబడి హెక్టారుకు 6 క్వింటాళ్ళ కన్నా తక్కువే. క్వింటాలుకు ఇప్పుడున్న రేటు 4 వేలు అంటే హెక్టారుకు స్థూల ఆదాయం రూ. 24 వేలు. రైతులు హెక్టారుకు ఆరు నుంచి పది ప్యాకెట్ల పత్తి విత్తనాన్ని, మొలక శాతాన్ని బట్టి వాడుతున్నారు. హెక్టారుకు విత్తన ఖర్చే రూ. 5,700 నుంచి రూ.9,500లు. స్థూల ఆదాయంలో 24 నుంచి 40% విత్తన ఖర్చే ఉంటే దుక్కి దున్నటానికి, రసాయన ఎరువులకు, పురుగు మందులకు, కూలీలకు పత్తి దిగుబడిపై వచ్చే స్థూల ఆదాయం ఎలా సరిపోతుంది? ప్రపంచ ఆకలిని తీర్చటానికి జన్యు మార్పిడి వంగడాలే సమాధానమని మోన్‌శాంటో గత రెండు దశాబ్దాలుగా చెప్పుకొస్తోంది. కాని వాస్తవానికి ఇప్పటివరకు మోన్‌శాంటో రూపొందించిన ఏ జన్యు మార్పిడి వంగడం కూడా ఉత్పత్తిని పెంచటానికి ఉద్దేశించింది కాదు. మోన్‌శాంటో వంగడాలన్నీ కలుపు నాశక మందులను తట్టుకొనేందుకు రూపొందించినవే.



ఈ మధ్యనే స్వదేశి జాగరణ్‌ మంచ్, వందనా శివ, మోన్‌ శాంటో ప్రవేశ పెట్టిన బోల్గార్డ్‌ –2 పత్తి గ్లైఫోసేట్‌ నిరోధక వంగడమని, అది క్యాన్సర్‌ కలిగిస్తుందని ఆరోపించారు. రైతుల పొలాల్లోంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ అదే నిజమని నిర్ధారించింది. అంతర్జాతీయ పౌర సమాజం చొరవతో ఏర్పాటుచేసిన ‘‘మోన్‌శాంటో ట్రిబ్యునల్‌’’, మోన్‌శాంటో వ్యాపార దృష్టితో అమ్ముతున్న ఉత్పత్తులు పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగజేస్తున్నాయని, మోన్‌ శాంటో వంటి సంస్థలను నియంత్రించటానికి అంతర్జాతీయ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది.



ప్రపంచవ్యాప్తంగా మోన్‌ శాంటో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అవినీతిమయం చేసి, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి, కుటుంబ కమతాలను నిర్వీర్యం చేసి రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. మోన్‌శాంటో, దానిలో వాటాదారుడైన బిల్‌గేట్స్‌ బిలియన్ల డాలర్ల కొద్దీ లంచాలిచ్చి నైజీ రియా, çఘనా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి పేద దేశాలలో జన్యుమార్పిడి వంగడాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు.



మోన్‌శాంటోకు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నాడు. మోన్‌శాంటో దాని జన్యు మార్పిడి వంగడాలను టెర్రరిజంతో పోల్చి రష్యాలో జన్యు మార్పిడి పంటలను పూర్తిగా నిషేధించాడు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, జపాన్, జన్యుమార్పిడి పంటలపైనా, వాటి పరిశోధనలపైనా, వాటి దిగుమతులపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా దేశాలు కూడా జన్యు మార్పిడి పంటల విస్తారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.



ఆహార పంటలలో స్వయం సమృద్ధిని సాధించిన ఇండి యాకు జన్యు మార్పిడి పంటలపై ఆధారపడవలసిన అవసరంలేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు చస్తుంటే జన్యు మార్పిడి వంగడాలు మనకెందుకు? జన్యుమార్పిడి పంటలను మన రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు జన్యుమార్పిడి పంటలపై సానుకూలంగా ఉన్నట్లు కనపడుతుంది. జన్యుమార్పిడి పంటల విస్తరణతో సరికొత్త ఆరోగ్య సమస్యలు పొంచిఉన్నాయి. కీటకాలను నాశనం చేసే విషపూరిత జన్యువులు కలిగిన జన్యుమార్పిడి ఆహారం వల్ల ఆ విషపూరిత జన్యువులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు వాడుకలో ఉన్న యాంటిబయోటిక్స్‌  నిష్ప్రయోజనమై ఇంకా కొత్త యాంటిబయోటిక్స్‌ను అభివృద్ధి పరచవలసిన అగత్యం ఏర్పడుతుంది.



మోన్‌శాంటో ఇంకా వినాశకరమైన విత్తనాలను ప్రపంచ రైతాంగంపై రుద్దనుంది. టేర్మినేటర్‌ టెక్నాలజీ,  ట్రైటర్‌ టెక్నాలజీ  అంటే విత్తన జీవ ప్రక్రియను నియంత్రించే టెక్నాలజీలతో విత్తన జీవప్రక్రియను నియంత్రించి పేటెంట్‌ హక్కులతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో కొనసాగే వ్యవసాయ ప్రపంచీకరణకు జన్యుమార్పిడి పంటల విస్తరణే ఆయువుపట్టు కానుంది. రైతాంగ భవిష్యత్తును ధ్వంసం చేయబోతున్న మోన్‌శాంటోకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్త ఆందోళనలు ఇప్పుడు తక్షణ ఆవశ్యం.

వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు ‘ 77020 84702

డాక్టర్‌ కె. క్రాంతి కుమార్‌ రెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top