
మతతత్వం మోడీ అస్త్రం
మోడీ గుజరాత్‌లో సాధించిన ‘గొప్ప అభివృద్ధి’ నిజస్వభావం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు: ‘‘నేను అనుసరించిన ఆర్థిక విధానాలను ఆచరించిన ఫలితంగానే గుజరాత్ అభివృద్ధి చెందింది.
విశ్లేషణ: మోడీ గుజరాత్‌లో సాధించిన ‘గొప్ప అభివృద్ధి’ నిజస్వభావం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు: ‘‘నేను అనుసరించిన ఆర్థిక విధానాలను ఆచరించిన ఫలితంగానే గుజరాత్ అభివృద్ధి చెందింది.’’ దీంతో ‘అభివృద్ధి’ అంటేనే రాష్ట్రంలోని పేద, బడుగు వర్గాల, మధ్య తరగతి ప్రజల గుండెలు గుభేలుమంటున్నాయి.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతాపార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా సాధికారికంగా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, ప్రధాని పదవిని చేపట్టే అవకాశాన్ని తృణప్రాయంగా త్యజంచిన త్యాగమూర్తిగా కాంగ్రెస్ వాదులంతా కీర్తిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీయే ఆ పార్టీ అభ్యర్థి అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ ‘అవివాహిత’ యువ కాంగ్రెస్ నేతకు కూడా ప్రధాని పదనిపై ఆశలు ఉన్నాయని తెలుస్తూనే ఉంది. ఆశలకు హద్దులు హద్దు ఉండనక్కరలేదు కదా! గుర్రం ఎగిరినా ఎగరవచ్చుననుకుంటూ కలల కడలిపై తేలి యాడుతున్న సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ సైతం ప్రధాని పదవి గోదాలో కుస్తీ పోటీకి రెడీగా ఉన్నారు. ఇలాంటి వస్తాదుల జాబితాలో చాలా పేర్లే ఉన్నాయి. కానీ అది అప్రస్తుతం.
బీజేపీకి గత్యంతరం లేకనే...
ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ప్రకటించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బీజేపీ ఆయన పేరును ప్రకటించాల్సివచ్చింది. ఆయన రాజ కీయ, ప్రచార చాతుర్యం అలాంటిది మరి. మోడీ అభ్యర్థిత్వానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటిమిలో వ్యతిరేకతరావడం సంగతి అటుంచి, ఆయన పేరును ప్రకటించకపోతే బీజేపీలోనే ముసలం పుట్టి, పుట్టి మునిగే పరిస్థితి వచ్చేది! మన రాష్ట్రంలో చంద్రబాబు పేరు వినగానే ‘వెన్నుపోటు’ గుర్తుకు వచ్చినట్లుగా మోడీ పేరు వింటేనే గోధ్రా ఘటన తదుపరి గుజరాత్‌లో ముస్లిం లపై జరిగిన దారుణ మారణహోమం గుర్తుకు వస్తుంది! నిజానికి గుజరాత్‌కు బయట నరేంద్రమోడీ పేరు వినిపించినది అలాగే! నాటి ముస్లింల ఊచకోత ముందస్తు పథకం ప్రకారం జరిగిందేననీ, పోలీసులను ప్రేక్షకపాత్ర వహించమని ప్రభుత్వమే సూచించిందనీ అప్పటి రాష్ట్ర మంత్రి హిరేన్ పాండ్యా స్వయంగా తెలిపారు.
ఆ మంత్రి తర్వాత హత్య చేయబడ్డారు. అత్యంత ‘సమర్థవంతమైన’ పరిపాలకుడైన మోడీ ప్రభుత్వం ఆ హంతకులను ఇంత వరకూ పట్టుకోలేదు. గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్న ఐఏఎస్ అధికారి వంజారా ఇటీవలనే తన రాజీనామా లేఖలో ఇలా రాశారు : ‘అప్పటి గుజరాత్ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రేరేపణ మేరకు నేను, ఇంకా 30 మందికి పైగా పోలీస్ అధికారులం బూటకపు ఎన్‌కౌంటర్లు చేసిన నేరానికి నేడు జైళ్లలో ఉన్నాం. ఈ అమిత్‌షా ప్రభావంలో పడి ఒకప్పుడు నేను దేవునిలా ఆరాధించిన నరేంద్ర మోడీ చూస్తూ మిన్నకుండి పోయారు. వారు మమ్మల్ని పావులుగా వాడుకుని ఆనందాల నావలో తేలియాడుతున్నారు. కానీ వారి నావ త్వరలో మునగడం ఖాయం!’ అమిత్‌షా గుజరాత్ హోంమంత్రే కాదు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. పైగా పైన చెప్పిన లేఖ రాసిన ఐఏఎస్ ఆఫీసర్ వంజరాతో పాటూ సహముద్దాయిగా ఉన్న అమిత్ షా అప్పట్లో అరెస్టయ్యారు. కానీ బెయిల్‌పై బయటకు వచ్చారు. వంజరా జైలులోనే ఉన్నారు.
మోడీ అభ్యర్థిత్వానికి కొమ్ము కాచిందెవరు? హిందూ మతతత్వానికి ప్రతీక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్! మతం వేరు. మతతత్వం వేరు. మతం వ్యక్తిగతం. తమ మతం పట్ల ఎవరికైనా నమ్మకం, గౌరవం ఉండవచ్చు. కానీ మతతత్వం అందుకు భిన్నం. అది సంఘటిత పరమత ద్వేషం! హిందూ మతతత్వ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్షణమే అది! ఏ విధంగానైనా అనుకున్నది సాధించడమే ముఖ్యమని, లక్ష్యానికి తప్ప మార్గానికి ఏ మాత్రం విలువ లేదని భావించే వ్యక్తి మోడీ! తనపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తాత్కాలికంగా చెరుపుకోవడం కోసమైనా నాటి గుజరాత్ మారణహోమానికి నామమాత్రపు బహిరంగ క్షమాపణ చెప్పడానికి సైతం మోడీ సుముఖంగా లేరు. పైగా ఇటీవల ఆయన ఆనాటి దారుణ మారణకాండ గురించి మాట్లాడుతూ. పుండు మీద కారం చల్లినట్టుగా... కారు నడుపుతుంటే కారు కింద కుక్కపిల్ల పడుతుంది ఏం చేస్తాం? బాధపడతాం అంతేగదా? అని వ్యాఖ్యానించారు.
మోడీ ఎత్తుగడ ఏమిటి?
భారత ప్రజానీకం మతపరంగా నిట్టనిలువుగా చీలిపోవాలనేదే మోడీ ఎత్తుగడ. ఆ చీలిక ఎంత లోతుగా ఘనీభవిస్తే అంతగా తన విజయావకాశాలు మెరుగపడతాయని ఆయన భావన! ఎలాగైనా ప్రధాని కావడమే ఆయన లక్ష్యం. అందుకోసం దేశం మతకల్లోలాల అగ్నిగుండంలో మాడి మసైపోయినా ఆయనకు బాధలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మతకల్లోలాలు చెలరేగి దాదాపు 60 మంది బలైపోయారు. వారిలో అత్యధికులు ముస్లింలు. యాభై వేల మంది నిరాశ్రయులయ్యారు. అయినా ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యాక మోడీ తొలి ప్రసంగంలో మాటవరసకైనా ముజఫర్‌నగర్ ప్రస్తావన తేలేదు. మోడీకి, ఆయనను ముందు నిలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌కు కావాల్సిందే అలాంటి మతకలహాలే. దేశంలో నేటికీ అత్యధిక సాధారణ ప్రజానీకంలో, ప్రత్యేకించి పేద, దళిత, గిరిజన, వెనుకబడిన కులాలలో ఈ మతతత్వ ైపైత్యం లేదు. మెజారిటీ మతతత్వపు దుర్మార్గ భావజాలానికి తాము సైతం బలైపోతున్నామన్న గుర్తిం పు వారిలోనూ కలుగుతున్నది. కనుక పచ్చి మతతత్వవాది, తన లక్ష్యసాధనకు నగ్న నిరంకుశత్వానికి ఒడిగట్టే మోడీని వారు దేశ ప్రధానిగా అంగీకరింపరు.
‘అభివృద్ధి’ బూటకం
మోడీ గుజరాత్‌ను గొప్ప అభివృద్ధి పథాన నడిపించారనీ, దేశం కూడా ఆయన నేతృత్వంలో అభివృద్ధి పథాన సాగగలదని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రత్యేకించి మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజానీకంపై, విద్యావంతులపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి: ‘‘నేను ప్రతిపాదించిన, అనుసరించిన ఆర్థిక విధానాలనే మోడీ కూడా ఆచరించిన ఫలితంగానే గుజరాత్ అభివృద్ధి చెందింది.’’ దీనితో మోడీ ‘అభివృద్ధి’ అంటేనే రాష్ట్రంలోని పేద, బడుగువర్గాల, మధ్య తరగతి ప్రజల గుండెలు గుభేలుమన్నాయి.
అమ్మో, చంద్రబాబు మార్క్ హైటెక్ అభివృద్ధా! అని బేజారెత్తిపోతున్నారు. పేద, సాదలను, సామాన్య ప్రజలను రాచిరంపాన పెట్టిన బాబు మార్కు ‘అభివృద్ధి’ దెబ్బకు... చంద్రబాబు 2004 నుంచి శాశ్వత ప్రతిపక్ష నేతగా బతుకుతున్నారు! ప్రజలు తమకు మేలు చేసే సంక్షేమకర అభివృద్ధి అంటే ఏమిటో అనుభవం ద్వారా గ్రహించారు. కాబట్టే 2009లో వరుసగా రెండవసారి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన విజయం కట్టబెట్టారు. మోడీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వలననే ప్రతిపక్షాలు ఏకమై కేంద్రంలో కాంగ్రెస్‌ను గద్దె దించగలిగాయంటూ ప్రశంసించారు. అంతేగానీ ఎన్డీఏ భాగస్వామిగా గతంలో తమ పార్టీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబును తలవనైనా తలవలేదు. అయినా చంద్రబాబు హస్తినకు పోయి బీజేపీతో పొత్తుకు తెరవెనుక రాయభారాలు సాగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉన్నదని కొందరు ప్రముఖ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి అందులో ఆశ్చర్యపడవలసిందేమీలేదు. అయితే ‘‘బీజేపీతో కలిసి చారిత్రక తప్పిదం చేశామని’’ చంద్రబాబు అంటూనే ఉన్నారు. ఆయనతో పొత్తు ససేమిరా వల్లకాదని స్థానిక బీజేపీ నేతలు విరుచుకుపడుతూనే ఉన్నారు. మరోవంక అదే చంద్రబాబు అదే నోటితో ‘బీజేపీతో పొత్తు విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
తద్వారా అదే తన అభిమతమని చెప్పకనే చెబుతున్నారు. పదవే పరమార్ధం అనుకునే బాబు లాంటి నేతల నుంచి నిజాయితీని, నిబద్ధతను ఆశిం చడం పొరబాటు. చంద్రబాబు గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని, వారి సహాయంతో జాతీయస్థాయి నాయకుని హోదాను వెలగబెట్టారు. అవసరం తీరిన వెంటనే కమ్యూనిస్టులను కూరలో కరివేపాకును తీసేసి పారేసినట్టుగా తీసిపారేసి, బీజేపీతో చేతులు కలపలేదూ? కాకపోతే ఉన్న చిక్కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా బీజేపీ పరిస్థితే. కాబట్టి బీజేపీ బాబును నమ్ముకోవడమంటే ‘తాను దూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్టు అవుతుంది. నిజంగానే మోడీ అధికార పీఠాన్ని ఎక్కగలిగేటంతటి బలమైన అభ్యర్థిగా ముందుకువస్తే దేశ లౌకికతత్వాన్ని పరిరక్షించడమే లౌకికశక్తులు, వామపక్షశక్తులు, బహుజన పార్టీలు, శక్తుల ప్రథమ కర్తవ్యం అవుతుంది.