‘కింద ఉన్న ప్లకార్డు పట్టుకున్న.. వేరే ఉద్దేశం లేదు’ | Sakshi
Sakshi News home page

‘‘ఫ్రీ కశ్మీర్‌’ అని నిరసిస్తే కేసులతో వేధిస్తున్నారు’

Published Wed, Jan 8 2020 11:24 AM

Free Kashmir Placard At Mumbai Protest Case Registered On Woman - Sakshi

ముంబై :కశ్మీర్‌కు విముక్తి కల్పించండి’అని ప్లకార్డు ప్రదర్శించిన ఓ యువతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి నిరసనగా గేట్‌వే ముట్టడికి యత్నించి.. నిరసన తెలిపిన మహక్‌ మీర్జా ప్రభు.. ‘ఫ్రీ కశ్మీర్‌’అనే ప్లకార్డును ప్రదరించింది. దీంతో జాతీ సమైఖ్యతను దెబ్బతీసేలా వ్యవహరించారని పేర్కొంటూ ఐపీసీ సెక్షన్‌ 153B కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో కశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పునరుద్ధరించాలని కోరేందుకు ‘ఫ్రీ కశ్మీర్‌’ ప్లకార్డును ప్రదర్శించానని మహక్‌ మీర్జా తెలిపారు. కశ్మీరీల సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే అలా చేశానని పేర్కొన్నారు. అంతేగానీ, జాతి వ్యతిరేక నినాదాలు చేయడానికి కాదని ఆమె చెప్పుకొచ్చారు.
(చదవండి : ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..)

ఆంక్షలు లేని కశ్మీర్‌ కావాలని అడగడం తన తప్పా అని ఆమె వాపోయారు. ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేసి వేధిస్తే.. తదుపరి పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.మహక్‌ మీర్జా మాట్లాడుతూ.. ‘గేట్‌వే నిరసనలో పాల్గొనేందుకు సాయంత్రం 7.30 గంటలకు అక్కడకు చేరుకున్నా. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించొద్దని అందరి దృష్టికి తెచ్చేందుకు అక్కడ పడి ఉన్న ఫ్రీకశ్మీర్‌ ప్లకార్డును చేతిలోకి తీసుకున్నా’అని ఆమె చెప్పుకొచ్చారు. మహక్‌ రచయిత కావడం గమనార్హం. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. నిరసనలు జరిగేది ఒక అంశంపై అయితే కశ్మీర్‌కు విముక్తి కావాలనే నినాదాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ముంబైలో వేర్పాటువాదులకు స్థానమెవరిచ్చారని అన్నారు. సీఎం ఉద్ధవ్‌ నేతృత్వంలోనే దేశ వ్యతిరేక నినాదాలు పుట్టుకొచ్చాయా అని సందేహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement