అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్‌

అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్‌ - Sakshi


కేంద్రం, ప్రతిపక్షాల అండ ఉన్నప్పటికీ బలపరీక్షలో ఓటమి

ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలం

శశికళకే జై కొట్టిన అన్నాడీఎంకే శాసనసభ్యులు  

మరో నాలుగేళ్లు అధికారం వదులుకునేందుకు విముఖత




సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అధికార హోదా, వెన్నంటి ఉన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, బాసటగా నిలిచిన ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల అండ, సినీ ప్రముఖుల మద్దతు, సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన సంఘీభావం, అన్నింటికీ మించి కేంద్రం ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా... ఇవేవీ పన్నీర్‌ సెల్వంను ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించేందుకు ఉపయోగపడలేదు. ఆయనకు అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ బలపరీక్షలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 122 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం ఎడప్పాడి పళనిస్వామిని బలపరచడం, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్‌ పక్షాన నిలవడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ వర్గాలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నాయి.



చిన్నమ్మ నిర్బంధంలో ఎమ్మెల్యేలు

మొదట పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేసిన వెంటనే శశికళ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. వారందరినీ రిసార్టుకు తరలించారు. ఎమ్మెల్యేలకు నిత్యం హితబోధ చేశారు. తనకు మద్దతిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కల్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదుగురు చొప్పున బౌన్సర్లను రక్షణగా పెట్టారు. చివరకు టాయిలెట్‌కు వెళ్లినా బౌన్సర్లు ఉండాల్సిందే. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎమ్మెల్యేలు తెలుసుకోకుండా వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోల్డన్‌ బే రిసార్టులోని టీవీల్లో కేవలం ‘జయ టీవీ’ మాత్రమే ప్రసారమయ్యేలా చేశారు. ఒకరకంగా బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు లేకుండా తెలివిగా వ్యవహరించారు.



అధికారం ఎందుకు వదులుకోవాలి?

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో చాలామంది చిన్నమ్మ ఆశీస్సులతో టిక్కెట్లు పొంది గెలిచినవారే. అంతేకాకుండా తటస్థ, వ్యతిరేక ఎమ్మెల్యేలను కూడా బెదిరించి, మభ్యపెట్టి ఆమె తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది తొలిసారిగా ఎన్నికైనవారే. ‘‘ఎన్నికల్లో ఎంతో ఖర్చుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నిండా ఏడాది కూడా ముగియలేదు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. గెలుస్తామో లేదో తెలియదు. శశికళ వైపు నిలిస్తే మరో నాలుగేళ్లపాటు మనకు తిరుగు ఉండదు’’ అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే పన్నీర్‌సెల్వం వర్గంలో చేరేందుకు వారు ఆసక్తి చూపలేదు. ఎమ్మెల్యేలపై పట్టు లేకపోవడమే పన్నీర్‌ ఓటమికి కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. శశికళ లాగా పన్నీర్‌ ఎమ్మెల్యేలకు వల వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు రెండు వారాల సమయం లభించినప్పటికీ ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరి క్షణంలో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల తనకే మద్దతు ఇస్తారని పన్నీర్‌ సెల్వం ధీమా వ్యక్తం చేసినప్పటికీ అది వాస్తవరూపం దాల్చలేదు.



పన్నీర్‌ను ముంచిన మెతక వైఖరి

ప్రజల అండదండలు, అమ్మ జయలలిత పట్ల విధేయత ఉన్నా రాజకీయాల్లో పన్నీర్‌ సెల్వం అనుసరించిన మెతకవైఖరే ఆయనను ముంచేసింది. అమ్మ పట్ల ఉన్న అభిమానంతో ప్రత్యర్థి వర్గంలోని ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారని నింపాదిగా ఇంట్లో కూర్చొని వేచి చూడడం మినహా పన్నీర్‌ ప్రత్యేక ప్రయత్నాలేం చేయలేదు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు లేదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.



మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి



జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి



చెన్నైకు చిన్నమ్మ?



విజేత పళని



నాడూ.. నేడూ.. అదే డ్రామా!



చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్‌



స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top