సమాజానికి అద్దం... ఈ ‘బంగారు తల్లి’

సమాజానికి అద్దం... ఈ ‘బంగారు తల్లి’ - Sakshi


చిత్ర నిర్మాణ సంఖ్య రీత్యా దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నా, జాతీయ అవార్డుల రీత్యా ఆఖరు స్థానానికే పరిమితమవుతున్న తెలుగు సినిమా బుధవారం నాడు జాతీయ స్థాయిలో తలెత్తుకు నిలబడింది. 2013వ సంవత్సరానికి గాను బుధవారం సాయంత్రం ప్రకటించిన 61వ జాతీయ అవార్డుల్లో రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ మూడు అవార్డులు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతానికి (శాంతనూ మొయిత్రా) అవార్డు దక్కించుకుంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలీ పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ‘‘జాలి, దయ లేని సెక్స్ వ్యాపార ప్రపంచం ఎంతగా వేళ్ళూనుకొందో తెరపై అధిక్షేపిస్తూ చూపించిన’’ సినిమాగా ‘నా బంగారు తల్లి’ని జ్యూరీ ప్రశంసించింది.

 

 ఆలోచింపజేసే కథ... అంతర్జాతీయ ప్రశంసలు...




 సెక్స్ అవసరాల నిమిత్తం ఆడపిల్లల అక్రమ రవాణా, అమ్మకమనే అంశం చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ‘‘నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి పత్రికల్లో చదువుతున్నాం. సమాజాన్ని పీడిస్తున్న ఈ అంశం ఆధారంగా తీసిన సినిమా ఇది. దేశంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథగా చిత్రీకరించిన ఈ సినిమా అన్ని ప్రాంతాల వారి మనసులనూ కదిలిస్తుంది’’ అని రాజేశ్ అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు ‘నా బంగారు తల్లి’ గురించి పెద్దగా తెలియకపోయినా, నిజానికి ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

 

 ఇండొనేసియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్ట్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2013లో ఉత్తమ చలనచిత్రం సహా పలు అంతర్జాతీయ అవార్డులు సంపాదించుకుంది. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయి గౌరవం సాధించుకుంది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు పేరు వచ్చినా, ఇక్కడ సరైన గుర్తింపు రాలేదని వెలితిగా ఉండేది. కానీ, ఈ జాతీయ అవార్డులతో ఆ వెలితి తీరిపోయింది’’ అని దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ తన ఆనందం పంచుకున్నారు. ‘బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు వెళ్ళి, ప్రస్తుతం అక్కడే ఉన్న ఆయన ఇ-మెయిల్ ద్వారా తన స్పందనను తెలిపారు.

 

 వాస్తవిక జీవితం నుంచి వెండి తెరకు...



 మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సేవకురాలు సునీతా కృష్ణన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడమే కాక, ‘కాన్సెప్ట్ ఎడ్వైజర్’గా దర్శకుడికి అండగా నిలిచారు. ఆమె స్వయంగా చూసిన నిజజీవిత అనుభవాలు కూడా ఈ చిత్ర రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఇక, జ్యూరీ నుంచి ప్రత్యేక ప్రశంస అందుకున్న ఈ చిత్ర నటి అంజలీ పాటిల్ నిజజీవితంలో ఆడపిల్లల అక్రమ వ్యాపారమనే చేదు అనుభవాన్ని చవిచూసినవారే. ‘‘ధైర్యంగా ముందుకు వచ్చి నిజజీవిత కథను ప్రపంచానికి చెప్పినందుకు’’ గాను ఆమె తెగువను జ్యూరీ ప్రశంసించింది.

 

 ఇక, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ శ్రీలంకలోని అంతర్యుద్ధంపై గతంలో ఆయన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమా తీసి, అనేక అవార్డులు గెలుచుకొన్నారు. ‘‘ఎయిడ్స్, ప్రపంచ శాంతి, అక్రమ రవాణా లాంటి అనేక సమస్యలను ఎత్తిచూపేందుకు దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకోవాలని నా భావన’’ అని రాజేశ్ అన్నారు. అందుకు తగ్గట్లే ‘ప్రయోజనాత్మక చిత్ర’ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో ఏళ్ళుగా సినిమాలను నిర్మిస్తున్నారాయన. హైదరాబాద్‌లో స్థిరపడిన ఈ మలయాళీ ఇలా మన తెలుగు సినిమాకు గౌరవం తేవడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top