శంభల! అద్భుతమా..? అపోహా..?


హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తీ పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ 'యతి' రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారూ ఉన్నారు. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దాని పేరే 'శంభల' దీన్నే పాశ్చాత్యులు 'హిడెన్ సిటీ' అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!




 సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు..

 కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ శంభల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢచిత్తులై ఉండాలని, ఎవరికి పడితే వారికి ఇది కనిపించదని.. ఎందుకంటే శంభల అతి పవిత్రమైన ప్రదేశమనీ చాలా మంది విశ్వసిస్తారు.


 




 భౌద్ధగ్రంథాల ప్రకారం..

 బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారు. వీరి ఆయుఃప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. వారు మహిమాన్వితులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి మరో కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది.




 రష్యా పరిశోధనలు..

 1920లో శంభల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన  ప్రత్యేక మిలటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు.




 హిట్లర్ ప్రయత్నాలు..

 ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంభల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని.. దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్‌కు చెప్పాడు.




అనేక గ్రంథాల్లో..

గోబి ఎడారికి దగ్గరిలో ఉన్న శంభల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రం అవుతుందని బుద్ధుడు 'కాలచక్ర'లో రాశారు. ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్  కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు.




 ఎక్కడ ఉంది..?

 సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందనీ.. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది.




 మరిన్ని విశేషాలు..


  •      పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు.

  •      ఇక్కడ ప్రజలు సుమారు 12 అడుగుల పొడవు ఉంటారు.

  •      హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడి ఉంది. ఈ ప్రయాణంలో తొలుత ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి.

  •      పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది కున్లున్ పర్వత శ్రేణులతో కలిసి ఉండొచ్చు.

  •      ఆధ్యాత్మి క ధోరణి లేనివారికి ఈ నగరం కనిపించదని చెబుతుంటారు.

  •      పాశ్చాత్యులు  ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్.. అనే పేర్లతో పిలుస్తారు.
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top