శ్రీమంతుడి ఎఫెక్ట్: రోడ్డెక్కిన సైకిళ్లు! | cycles start roaming on roads after srimanthudu release | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడి ఎఫెక్ట్: రోడ్డెక్కిన సైకిళ్లు!

Aug 11 2015 4:43 PM | Updated on Sep 3 2017 7:14 AM

సినిమాలు యువత మీద గట్టిగానే ప్రభావం చూపిస్తాయి. శివ సినిమా విడుదలైనప్పుడు అప్పటి కాలేజి కుర్రాళ్లు చాలామంది సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగేవాళ్లు. ఇప్పుడు శ్రీమంతుడు విడుదల తర్వాత కుర్రాళ్లంతా సైకిళ్ల దుమ్ము దులుపుతున్నారు.

హైదరాబాద్:

సినిమాలు యువత మీద గట్టిగానే ప్రభావం చూపిస్తాయి. 1989 ప్రాంతంలో శివ సినిమా విడుదలైనప్పుడు అప్పటి కాలేజి కుర్రాళ్లు చాలామంది సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగేవాళ్లు. ఇక ఫ్యాషన్ల విషయంలో కూడా హీరోలను అనుకరించడం మన యూత్కు మామూలే. తాజాగా విడుదలైన శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు సైకిల్ మీదే ఎక్కువగా తిరుగుతుంటాడు. అది చూసి కుర్రాళ్లంతా సైకిళ్ల దుమ్ము దులుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రులు ఎక్కడికైనా సైకిల్ వేసుకుని వెళ్లమంటే కావాలంటే నడిచి వెళ్తా, లేకపోతే బండి వేసుకెళ్తా గానీ.. సైకిలా అని అడిగేవవాళ్లంతా కూడా ఇప్పుడు మారిపోతున్నారు.

ఇంట్లో మూలపడిన సైకిళ్లను బయటకు తీసి, శుభ్రంగా తుడిచి, బాగు చేయించుకుని వాటిమీద షికార్లకు వెళ్తున్నారు. చిన్న చిన్న అవసరాలకు వెళ్లడంతో పాటు.. సాయంత్రాలు అలా బయటకు వెళ్లాలన్నా సైకిళ్లను బయటకు తీస్తున్నారు. చివరకు కొన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసేవాళ్లు కూడా ఇప్పటివరకు క్యాంపస్లో ఉన్న సైకిళ్లను ముట్టుకునేవారు కారు. ఇప్పుడు మాత్రం ఆ సైకిళ్లకు పోటీ పెరిగిపోతోందని ఇన్ఫోసిస్ ఉద్యోగి శ్రీహర్ష చెప్పాడు. ఇటు ఆరోగ్యంతో పాటు అటు కాలుష్య నియంత్రణకు కూడా సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే. చైనా లాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా సైకిళ్లు వాడాలన్న నిబంధనలున్నాయి.

మన దేశంలో అలాంటి నిబంధనలు అక్కర్లేదు.. ఇలా హీరోలతో నాలుగైదు సినిమాల్లో సైకిళ్లు తొక్కిస్తే చాలని అంతా అనుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు తిరగడం మొదలుపెడితే.. ఇక సైకిళ్ల వాడకం కూడా ఎక్కువ కావచ్చని అంటున్నారు. మెట్రో స్టేషన్లలో సైకిళ్లు ఉంచుతామని, వాటిని వాడుకుని మళ్లీ స్టేషన్లో అప్పగించొచ్చని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదంతా జరిగితే.. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, హైదరాబాదీయుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement