‘గంపగుత్త’ పద్దుకు చుక్కెదురు | CAG takes on Irrigation allocations against to constitution | Sakshi
Sakshi News home page

‘గంపగుత్త’ పద్దుకు చుక్కెదురు

Mar 25 2016 2:13 AM | Updated on Sep 22 2018 8:48 PM

‘గంపగుత్త’ పద్దుకు చుక్కెదురు - Sakshi

‘గంపగుత్త’ పద్దుకు చుక్కెదురు

నిధుల వినియోగంలో సాగు నీటిపారుదల శాఖకే సర్వాధికారాలు అప్పగించాలని, బడ్జెట్ పద్దులను అందుకనుగుణంగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది.

- రాజ్యాంగ విరుద్ధమంటూ కాగ్ అక్షింతలు  
- పాత పద్ధతిలోనే సాగునీటి కేటాయింపులు

 
 సాక్షి, హైదరాబాద్: నిధుల వినియోగంలో సాగు నీటిపారుదల శాఖకే సర్వాధికారాలు అప్పగించాలని, బడ్జెట్ పద్దులను అందుకనుగుణంగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. దీనిపై స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్కారుకు షాక్ తగిలినట్లయింది. ఈ విషయమై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బడ్జెట్ రూపకల్పనలో రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలను ఉల్లంఘించినట్టుగా ఉన్నాయని కాగ్ వేలెత్తి చూపింది. సాగునీటి శాఖకు గంపగుత్తగా నిధులు అప్పగించేందుకు పద్దులను కుదిస్తూ, నీటిపారుదల శాఖే బిల్లులు చెల్లిం చేలా విధానపరమైన మార్పులు చేస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కీలకమైన నిర్ణయాలన్నీ చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయిలోనే తీసుకునేలా పలు మార్పులను వాటిలో పొందుపరిచింది. ఈ ఉత్తర్వులు గందరగోళంగా ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ ఘాటుగా లేఖ రాసింది. నీటి పారుదల శాఖకు అన్ని శాఖల మాదిరిగానే బిల్లులు చెల్లించడానికి బదులు పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతా తెరిచి నిధులు మళ్లించే ప్రయత్నమెందుకని ప్రశ్నించింది.  స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలకే పీడీ ఖాతాలో నిధులు కేటాయిస్తారు. కానీ ప్రభుత్వపరంగా జరిగే సాగునీటి శాఖ ఆర్థిక నిర్వహణకు పీడీ ఖాతాలెందుకంటూ అభ్యంతరపెట్టింది. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రంతో పాటు ఏఐబీపీ, తదితర ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల నుంచి నిధులు ఖర్చు చేస్తున్నారు. ‘‘రాష్ట్ర బడ్జెట్‌లోని కేటాయింపులను ఒకే పద్దు కింద అప్పగిస్తే పలు సంస్థల నుంచి వచ్చిన ఈ నిధులను ఏ పద్దులో పొందుపరుస్తారు? పద్దు లేకుండా వాటిని తిరిగి ఎలా చెల్లిస్తారు?’’ అని కాగ్ నిల దీసింది. ‘‘బడ్జెట్ అంటేనే విపులంగా, విస్తారం గా ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. ప్రతి పద్దు కిందా చేసే ఖర్చును చట్ట సభల్లో సభ్యులకు తెలియజేయాలి. సభ ఆమోదం మేరకు ద్రవ్య వినిమయం తప్పనిసరిగా జరగాలి. అం దుకు భిన్నంగా తక్కువ పద్దుల్లో నిధులన్నీ అప్పగించడం కుదరదు’’ అని లేఖలో స్పష్టం చేసింది. దీన్ని మార్చి 8న రాసినట్టు తెలిసింది.
 
 ముందు నుంచే వివాదం
 సాగునీటి ప్రాజెక్టులకు వార్షిక బడ్జెట్‌లో వేలాది కోట్లు కేటాయించటం కొత్తేమీ కాదు. అయితే ప్రాణహిత, కాళేశ్వరం, ఎస్సారెస్పీ ఆధునీకరణ... ఇలా ప్రాజెక్టులవారీగా, ప్రాంతాలవారీగా బడ్జెట్‌లో విడివిడిగా నిధుల కేటాయింపు ఉంటుంది. కానీ నీటి పారుదల విభాగం మాత్రం అందుకు భిన్నంగా, తమకు కేవలం ఒకే పద్దులో నిధులప్పగించాలంటూ గత నవంబరు నుంచే ప్రతిపాదనలు ఇవ్వసాగింది. దీనిపై ఆర్థిక శాఖ విస్మయం వ్యక్తం చేసింది కూడా. అయినప్పటికీ, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులను నీటిపారుదల శాఖ నేరుగా ఖర్చు పెట్టేలా కొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ నవంబరు 20 నాటి సమీక్షలో పేర్కొన్నారు. ఆ భేటీ అజెండాను చూసిన అకౌంటెంట్ జనరల్, సమావేశానికి ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవడం అప్పుడే చర్చనీయమైంది. ఒక శాఖ తన ఇష్టానికి నిధులు ఖర్చు చేసే ఈ కొత్త సంప్రదాయమేమిటంటూ ఆర్థిక శాఖను సైతం ఏజీ కార్యాలయం ఆరా తీసింది. ఇప్పుడిదే అంశంపై కాగ్ సైతం అక్షింతలు వేయటం గమనార్హం.
 
 అప్రమత్తమైన సర్కారు
 కాగ్ అక్షింతలతో అప్రమత్తమైన ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన సందర్భంగా తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తారనే కనీస వివరాల్లేకుండా సాగునీటి శాఖకు గంపగుత్తగా నిధులు కేటాయించేందుకు చేసిన ప్రయత్నాలనూ విరమించుకుంది. ఈ విషయమై జారీ చేసిన జీవో నంబర్ 12ను పక్కన పెట్టింది. 2016-17 బడ్జెట్‌లో నీటిపారుదల విభాగానికి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయించినా, నిరుటి బడ్జెట్ తరహాలోనే పద్దులన్నీ యథాతథంగా పొందుపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement