పిల్లలకు A సినిమా!?

పిల్లలకు A సినిమా!? - Sakshi


చిన్నప్పుడు బూట్లు పాలిష్ చేసి, కంపాస్ బాక్స్‌లో పెన్సిల్ షార్పెన్ చేసిచ్చి, రెండు జడలకీ రిబ్బన్ సమానంగా ఉండేటట్టు కట్టి, ఎడం చేతితో పాపనెత్తుకుని, కుడిచేత్తో  బువ్వ పెడుతూ బస్సెక్కించిన నాన్న ఇప్పుడు ‘ఏ’ సినిమాకి టికెట్టు కొనాలి?  ‘మీ అమ్మాయి ఏది చూసినా అట్టే గ్రహించేస్తుందండీ’... అన్న టీచరు మెచ్చుకోలు గుర్తుకొచ్చి పాపతో సినిమా చూస్తున్న నాన్న ‘సీన్’ని చూసి ఇబ్బంది పడాలా? పాపను చూసి ఇబ్బంది పడాలా? ఏది దారి? ఎక్కడ ఎగ్జిట్?

 

స్కూలు సెలవులతో సినిమాకు తీసుకెళ్ళమంటూ పిల్లల డిమాండ్‌లు. ఏ సినిమా చూపించాలి?బల్ల కింద నుంచి హీరో తొడ మీద చేయి వేసిన హీరోయిన్ ‘టచ్‌లో ఉంటానండీ’ అంటుంది. ‘మీ టచింగ్ కోసం ఎదురుచూ....స్తూ ఉంటానండీ’ అంటాడు హీరో. ఈ సినిమానా?గొడ్డలితో హీరో విసురుగా గూండా తలపై కొడితే, తల పగిలి రక్తం చిందుతుంది.



ఈ సినిమానా?



కమెడియన్‌ను హీరో లెంపకాయ కొడుతుంటే, హీరోయిన్ సంబరపడు తుంటుంది. ఈ సినిమానా?హీరో ఇంట్లో హీరోయిన్ ‘దారా! కమిటైపోదాం’ అని పైన పడుతుంది. ఈ సినిమానా?కాలేజ్‌లో లెక్చరర్‌ను వెకిలి కామెంట్లు చేస్తుంటారు స్టూడెంట్స్. ఈ సినిమానా?తండ్రిని హీరో ఒరే అనీ, పేరు పెట్టీ పిలుస్తుంటాడు. కలసి మందు కొడతారు.



ఈ సినిమానా?

 

సినిమాలు వేరు కావచ్చు... సీన్లు వేర్వేరు కావచ్చు. కానీ, తెర నిండా పరుచుకొంటున్నవి అదుపు లేని రొమాన్స్, అదుపు తప్పిన వయొలెన్స్... అంతే వయొలెంట్ కామెడీ. వీటిలో పిల్లలకు ఏ సినిమా చూపించాలి? పెద్దల సినిమాకే... పిల్లలు కూడా! ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలకు మనమే అనాలోచితంగా మన పిల్లల్ని తీసుకెళుతున్నాం.

 

హైదరాబాద్‌లో ఒక అగ్రహీరో సినిమా చూసిన పదేళ్ళ సందీప్ చేతిలో బొమ్మ తుపాకీ తీసుకొని ‘డిష్యుం... డిష్యుం...’ అంటూ కాల్చడం, ఆ తుపాకీ దెబ్బకు చుట్టుపక్కలవాళ్ళు పడిపోవాలనుకోవడం... ఇదీ వాలకం.  విజయవాడ... గాంధీనగర్‌లోని పద్నాలుగేళ్ళ దివ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. అబ్బాయిలతో సన్నిహితంగా తిరగడం... చదువు మీద ఆసక్తి లేకపోవడం... ఎప్పుడూ ఫోన్‌లో కబుర్లు... నెట్‌లో మెయిల్స్... (పేర్లు మార్చి రాశాం). ‘‘హాలీవుడ్‌లో 60 శాతం సినిమాలు - బాలల చిత్రాలు, లేదంటే బాలల్ని ఆకట్టుకొనే అంశాల చుట్టూ నడిచే సినిమాలు. అక్కడ పిల్లల కోసం పెద్దవాళ్ళు కూడా సినిమాలకు వెళ్ళే ట్రెండ్ ఉంది. కానీ, ఇక్కడ రివర్స్. పెద్దవాళ్ళు తమ వయసుకు నచ్చే సినిమాలకు వెళుతూ, పిల్లల్ని వెంట తీసుకువెళుతున్నారు. అలా పిల్లలు తమ వయసుతో సంబంధం లేని ‘పెద్దల’ చిత్రాలు చూసేస్తున్నారు. సహజంగానే అది ఆ పసి మనసుల్ని ఇంప్యాక్ట్ చేస్తోంది’’ అని ‘హీరో’తో ఉత్తమ బాలల చిత్రం నంది అవార్డు సాధించిన దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 

మార్కెట్ ఉంది! తీసేదెవరు?


 

పిల్లలకు ప్రత్యేకంగా సినిమాలేంటి అని ఆశ్చర్యపోకండి! హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచం మొత్తంలో అత్యధిక కలెక్షన్లు వచ్చింది మన హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్‌లోనే! నిజానికి, ఒక టాప్ స్టార్ చిల్డ్రన్‌‌స ఫిల్మ్ చేస్తే చూడరా? ఆమిర్‌ఖాన్ ‘తారే జమీన్ పర్’ నుంచి ‘స్టాన్లీ కా డబ్బా’, సల్మాన్‌ఖాన్ తీయగా రణ్‌బీర్ కపూర్ నటించిన ‘చిల్లర్ పార్టీ’, సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ‘క్రిష్’ లాంటివన్నీ ఆ పనే చేశాయి. తెలుగులో అలా జరగడం లేదు. హాలీవుడ్ చిత్రం ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా నాగార్జున తీసిన ‘సిసింద్రీ’లో చాలా ఏళ్ళ క్రితం అలాంటి ప్రయత్నం కొంత జరిగినా, ఆ సినిమా కూడా ప్రత్యేక గీతాలు, ఫైట్ల ఫార్ములాలోనే ఇరుక్కుపోయింది.



ప్రోత్సాహకాలన్నీ పేపర్ మీదే!



వాస్తవానికి, ప్రభుత్వ పక్షాన బాలల చిత్రాలకు దాదాపు రూ. 35 లక్షల దాకా ప్రోత్సాహకాలున్నాయి. ‘‘కానీ, వాళ్ళు చెప్పిన పూర్తిస్థాయిలో సబ్సిడీ అందుకున్న సినిమా ఇప్పటి దాకా ఒక్కటీ లేదు. చాలా రోజులుగా అసలు చిల్డ్రన్స్ ఫిల్మ్‌ల స్క్రిప్ట్ సెలక్షన్ కమిటీయే లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాక, ఆ ప్రోత్సాహకాల పేపర్ ఎక్కడుందో కూడా తెలీదు’’ అని బాలల చిత్రాలు తీసిన దర్శక - రచయిత అక్కినేని కుటుంబరావు అన్నారు.



చివరకు పెద్దలు చూసే సినిమాలే పిల్లలూ చూస్తూ, మన సగటు ‘ఏ’ గ్రేడ్ హీరోల సినిమాల హీరోయిజమ్, డైలాగ్‌లు, ఆ భాషనే నేర్చుకుంటున్నారు. వయెలెన్స్, సెక్స్, పక్కవాణ్ణి తన్నడం వల్ల వచ్చే వెకిలి కామెడీనే ఇష్టపడుతున్నారు. మరి, ఆ తప్పెవరిది? పిల్లలదా? ఇంటా, బయటా ఆ సినిమాలే చూపుతున్న పెద్దలదా? పరిశ్రమదా? హెల్దీ న్యూ జనరేషన్‌ను తీర్చిదిద్దడంలో ఫెయిలవుతున్న సమాజానిదా?

 - రెంటాల జయదేవ

 

నేనెప్పుడూ పిల్లలు, ఫ్యామిలీ  చుట్టూ తిరుగుతా!

 

‘‘జ్యోతికతో నేను ‘36 వయదునిలే’ తీసిన బ్యానర్ ‘2డి’. అందులో ఒక ‘డి’ - మా ఎనిమిదేళ్ళ అమ్మాయి దియా. మరొక ‘డి’ - మా నాలుగేళ్ళ అబ్బాయి దేవ్. ఐ ఆల్వేస్ లవ్ డిస్నీ కంటెంట్. పిల్లలతో సహా వెళ్ళి, చూసే సినిమాలంటే నాకు ఇష్టం. బహుశా, చిన్న పిల్లల తండ్రిని కావడం కూడా అందుకు కారణమేమో!  ఐ థింక్ సోమచ్ స్కోప్ ఈజ్ దేర్ ఫర్ కిడ్స్ ఫిల్మ్స్.

 నా మటుకు నేను పిల్లలు, ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ, అంతా కలిసి చూసే సినిమాలు చేయాలనుకుంటున్నా.

 - హీరో సూర్య

 

 

ఎమోషనల్ కనెక్టే తప్ప... వయొలెన్స్ కాదు!




పిల్లలకు మనమేం చెప్తే, ఏం చూపిస్తే అది నేర్చుకుంటారు. నా సినిమాలన్నిట్లో చైల్డ్ సైకాలజీ నుంచే ఎమోషన్ బిల్డప్ చేశా.  చెడు మీద మంచి విజయం సాధించాలనే ఎమోషన్ రప్పించి ఫైట్స్ పెడతాం. వయొలెన్స్‌గా కాదు!  - బోయపాటి శ్రీను, డెరైక్టర్

 

 

కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ జాగ్రత్త పడాలి!



 పిల్లలపై సినిమాల ప్రభావం సబ్‌కాన్షస్ లెవల్‌లో ఉంది. పిల్లలకు ఎలాంటి వినోదం ఇస్తున్నామనేది తల్లితండ్రులు, టీచర్లు గమనించాలి. కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎలాంటి పాటలకు డ్యాన్స్ చేయిస్తున్నామో చూసుకోవాలి.

 - శైలజారావు, ‘ది ఫ్యూచర్ కిడ్స్’ స్కూల్ - హైదరాబాద్ ఫౌండర్ డెరైక్టర్

 

ఇది మనందరి వైఫల్యం!



 తెరపై నరుక్కోవడం నిత్యం చూపిస్తే అవన్నీ మామూలనే భావన వచ్చేస్తుంది. పెళ్ళిళ్ళలో ఐటమ్‌సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తున్నాం. ఇది స్లో పాయిజన్. దీన్ని సమస్యగా గుర్తించకపోవడం సమష్టి వైఫల్యం.  - డా. పద్మా పాల్వాయ్, చైల్డ్ -ఎడల్ట్ సైకియాట్రిస్ట్

 

ఇవాళ అన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే!



నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, సెన్సార్ కట్ అమలవుతోందా, లేదా అని చూసే పకడ్బందీ వ్యవస్థ లేదు. హీరో క్యారెక్టరైజేషన్, టాప్ హీరోయిన్స్ దుస్తుల దాకా అన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఉన్నార. - జీవిత, నటి-కేంద్ర సెన్సార్‌బోర్డ్ సభ్యురాలు

 

కామెడీ, యాక్షన్ లైక్ చేస్తా. ‘దూకుడు’ ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు! ‘అత్తారింటికి దారేది’లో అహల్య సీన్, ‘కిక్’లో పోలీసును గుద్దుకొనే సీన్ భలే నవ్విస్తాయి. స్కూల్‌మేట్స్ కొంతమంది సినిమాలు చూసి చెడ్డమాటలు నేర్చుకోవడం నాకు తెలుసు.       - పి. అనీష్, 12 సం, హైదరాబాద్

 

‘ఛత్రపతి, డార్లింగ్’ ఇష్టం. ‘టెంపర్’ నచ్చింది. వయొలెంట్ థ్రిల్లర్ ‘ఎన్‌హెచ్ 10’లో అనుష్క శర్మ వాళ్ళు మర్డరవడం, తిరిగి వాళ్ళను ఆమె మర్డర్ చేయడం థ్రిల్లింగ్. ఏ సినిమా చూసినా మన లైఫ్‌లో కూడా జరుగుతుందేమో అనిపిస్తుంటుంది.

 - శేషాద్రి, 15 సం, కర్నూలు

 

 సమ్మర్‌లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చూశా. అందులో ‘కమ్ టు ది పార్టీ సుబ్బల క్ష్మి...’ పాట ఇష్టం. ఇంట్లో నేను, తమ్ముడు బాగా ఫైటింగ్ చేసుకుంటాం. నాకు పాటలు, డ్యాన్సులు ఇష్టమైతే, మా తమ్ముడు సాత్విక్‌కు ఫైటింగ్ సినిమాలు ఇష్టం.

 - సింధు, 10 సం, నెక్కొండ

 

 సినిమాల్లో ఫైట్స్, కామెడీ లైక్ చేస్తా. విలన్‌ను హీరో కొడుతుంటే  చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ‘కిర్రాకు...’ పాట ఎప్పుడూ పాడుతుంటా. ఐటమ్ సాంగ్స్‌లో అయితే, ‘గబ్బర్ సింగ్’లోని ‘కెవ్వుకేక...’ ఇష్టం. దానికి సరదాగా డ్యాన్‌‌స చేస్తుంటా.

 - సాహితి, 14 సం, హైదరాబాద్

 

 ఫైటింగ్ సిన్మాలిష్టం. విలన్లని హీరో కొడుతుంటే భలే ఉంటుంది. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘డార్లింగ్’లో ఆ సీన్‌‌స బాగా నచ్చాయి. బ్రహ్మానందం కామెడీకి ఫ్యాన్‌ని. ‘రేసు గుర్రం’లో బ్రహ్మానందం కిల్‌బిల్ పాండే సీన్ ఇష్టం. అల్లు అర్జున్ డ్యాన్సులకు ఫ్యాన్‌ని.

 - కృష్ణజ, 13 సం, విశాఖపట్నం

 

 సిన్మాల్లోని పాటలు, ఫైట్లు, డ్యాన్సులంటే ఇష్టం. గట్లంటి సిన్మాలు సూస్తా. హీరో అల్లు అర్జున్ సిన్మాలు, అతని ఫైట్లు, డ్యాన్సులు మస్తుగుంటయ్.

 - తండ్రి లేని పిల్లాడు ఆలకుంట్ల అనిల్,

 10 సం., ప్రభుత్వ పాఠశాల,

 వర్ధన్నపేట, వరంగల్ జిల్లా

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top