ఇది ఓ అంతర్జాతీయ స్కామ్


 


 


రాజధాని దురాక్రమణ

బాబు బినామీలే భూ రాబందులు

కాజేసింది  25,000 ఎకరాలు

సాక్షి చేతిలో పక్కా ఆధారాలు



ఏపీ రాజధానిపై బినామీలకు ముందే లీకులు.. గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగోళ్లు సమీకరణలో ‘బాబు’ల భూములు క్షేమం.. వారివి కమర్షియల్ జోన్‌లో.. రైతులవి ‘అగ్రి’ జోన్‌లో దళితరైతులను భయపెట్టి అసైన్డ్ భూములూ కైంకర్యం..  రాజధాని హామీలన్నీ బూటకం..పరిహారం పచ్చిదగా.. నివాస - వాణిజ్యస్థలాలు నయవంచన.. మిగిలింది మూడు శంకుస్థాపనలు.. నాలుగు మట్టి ముంతలు

 

పెద్దలంతా కలసి పక్కాగా ప్లాన్ చేశారు... బువ్వపెట్టేవాడి కడుపు కొట్టి 25,000 ఎకరాలు మింగేశారు..  ‘రాజధాని’ అస్త్రాన్ని ఉపయోగించి యథేచ్ఛ దోపిడీకి స్కెచ్ గీశారు. చేతికి మట్టి అంటకుండా... రైతుల భూముల నుంచి లక్షల కోట్ల రూపాయలు దండుకునే ‘పథకం’ తయారు చేసి బ్రహ్మాండంగా అమలుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డెరైక్షన్‌లో బినామీ యాక్టర్లంతా యథాశక్తి రాణించారు.ఒక్కో బిట్టుకు ఒక్కో బినామీ...  పార్టీ ఆఫీసుల్లో, సొంత ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లమీద, స్నేహితులు - బంధువులు - పార్ట్‌నర్లు, ఇంట్లో పనివాళ్ల పేర్లమీద వందల ఎకరాలకు జీపీఏలు, అగ్రిమెంట్లు సృష్టించారు.

 

ఎన్నో కుట్రలు.. కుతంత్రాలు... రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే దానిపై లీకులిచ్చి రైతులను ‘రియల్ మోసం’ చేయడంతో మొదలైన కుట్రలు... సమీకరణకు ముందే రైతుల భూములు కొట్టేయడం దగ్గర్నుంచి పరిహారం రాదంటూ దళిత రైతులను భయపెట్టి కారుచౌకగా అసైన్డ్ భూములు నొక్కేయడం వరకు సాగాయి... జోన్ల మాయాజాలం...  ఏ జోన్ ఎక్కడ రావాలో వారే నిర్ణయించేశారు. బినామీల భూములను కమర్షియల్, డెవలప్‌మెంట్ జోన్లలో వేసి పేద రైతుల భూములను గ్రీన్‌జోన్‌లో పడేశారు. వారి భూమి ఎకరం నాలుగు కోట్లు.. రైతుల భూములు ఎకరం రూ 20 లక్షలు పలికేలా మాయజేశారు.

 

మన రాష్ట్రం... మన రాజధాని... మన బిడ్డల భవిష్యత్‌ను. మన నోటికాడ కూడును దోచుకుంటుంటేచూస్తూ వదిలేద్దామా..? పచ్చచొక్కా పట్టుకుని నిలదీద్దామా..?  పెదబాబు, చినబాబు, వారి బినామీలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు భోంచేశారనే వివరాలు ‘సాక్షి’ ఆధారాలతో సహా సంపాదించింది. ఆ వరుస కథనాలు నేటి నుంచి మీకోసం...

 

మహా మోసగాళ్లు వేసిన దిమ్మతిరిగే స్కెచ్!

డెరైక్టర్ బాబు.. యాక్టర్లు బినామీలు

 పెదబాబు డెరైక్టరైతే చినబాబు ప్రత్యక్ష పర్యవేక్షకుడు.. బాబు బినామీలంతా రాజధాని భూములు కొట్టేసే కుట్రలో పాత్రధారులునారాయణ, సుజనా, మురళీమోహన్, ప్రత్తిపాటి, దేవినేని, రావెల.. ఇలా పెదబాబు, చినబాబుల బినామీలు ఎందరో.. నారాయణ 3,600 ఎకరాలు, సుజనా 700 ఎకరాలు, లోకేశ్ 500 ఎకరాలు, ప్రత్తిపాటి 196 ఎకరాలు సొంతం చేసుకుని వేల కోట్ల రూపాయల లబ్ధి పొందారు..

 

రాజధాని స్థలంపై లీకులు...

రాజధాని ఎక్కడ నిర్మించాలనే దానిపై శివరామ కృష్ణన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు..



నూజివీడు సమీపంలో రాజధాని నిర్మిస్తారని ఒక పథకం ప్రకారం లీకులిచ్చారు. దాంతో వారు ముందుగా నిర్ణయించుకున్న అమరావతి ప్రాంతంలో భూముల రేట్లు పడిపోయాయి.



రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా నూజివీడుపై దృష్టి పెట్టి లావాదేవీలు జరుపుతున్న సమయంలో బాబు బినామీలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున కారుచౌకగా భూములు కొనేశారు.



నూజివీడు సమీపంలో భూములు కొన్న అమాయక రియల్ వ్యాపారులు, రైతులు వేల కోట్లు నష్టపోయారు. అమరావతి ప్రాంతంలో అమ్ముకున్న రైతులు కూడా లబోదిబోమన్నారు.



ఈ ‘రియల్ భూ మాయ’ గురించి ముందుగానే ఉప్పందుకున్న చంద్రబాబు బినామీలు అప్పటి లావాదేవీల్లో లక్ష కోట్లకు పైగా ఆర్జించారని అంచనా.

 

మోసపూరిత హామీలతో బాబు బురిడీ

 

రాజధాని ప్రాంత రైతులను బురిడీ కొట్టించి వారిని బుట్టలో వేసేందుకు చంద్రబాబు ఎన్నో మోసపూరిత హామీలిచ్చారు.



అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారు.



రాజధాని రైతులకు గరిష్టంగా రూ. 1.50 లక్షల పంట రుణాలను ఒకే విడతలో మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మాట మార్చి ‘రైతులకు అత్యాశ పనికిరాదు.. రుణాలన్నీ రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాను? చేయాల్సిన మాఫీ ఏదో చేసేశా..’’ అని వ్యాఖ్యానించారు..



కౌలు రైతులకు, రైతు కూలీలకు నెలకు రూ. 2,500 పెన్షన్ ఇస్తానని చెప్పారు. కానీ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వడం లేదు.



నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలిప్పిస్తామన్నారు... కొద్దిమంది యువకులకు ఊరూపేరూ లేని సంస్థతో కొద్దిరోజులు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు మాత్రం లేవని చేతులెత్తేశారు.



ఒక్క గ్రామాన్ని, ఒక్క ఇంటిని కూడా తొలగించబోమని చెప్పారు.. కానీ మూడు గ్రామాలను తొలగించడానికి రంగం సిద్ధం చేశారు.



విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తామన్నారు కానీ ఒక్కరికీ చేయలేదు.

 

భూ సమీకరణ ఓ అంతర్జాతీయ మోసం..

రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్ అనే అంతర్జాతీయ కుట్రపూరిత కాన్సెప్ట్‌ను సిద్ధం చేశారు.



29గ్రామాల్లో  మూడు పంటలు పండే 38,737ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు.



జీవనాధారం ఉండదంటూ పూలింగ్‌ను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.



ఇక్కడే చంద్రబాబు తన రహస్య ఎజెండా అమలుకు తెరలేపారు. మంత్రులు, బినామీలు కొనుగోలు చేసిన 5,000 ఎకరాలను ఆయా రైతుల చేత పూలింగ్‌కు ఇప్పించారు. దానిపై ఎల్లో మీడియాలో విస్తృతంగా అనుకూల ప్రచారం చేయించారు. భూములు ఇవ్వని వాళ్లు ఏదో కోల్పోతారు అన్నట్లు ప్రచారం సాగించడంతో రైతులంతా భూములను అప్పగించారు.



భూములు ఇవ్వడానికి సిద్ధపడని రైతులను సామాజికంగా విడదీసి ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను పంపి రైతులను నయానో భయానో ఒప్పించేలా చేశారు.



సమీకరణ స్వచ్ఛందమేనని చెప్పినా వాస్తవానికి రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారు. అదే సమయంలో బాబు  బినామీలు, బంధువులు, తెలుగుదేశం నాయకుల భూములను పూలింగ్ పరిధి నుంచి తప్పించారు. ఉదాహరణకు రాజధాని సరిహద్దు రేఖ లింగమనేని ఎస్టేట్స్ భూములకు 10 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఫలితంగా ముఖ్యమంత్రికి లింగమనేని గెస్ట్ హౌస్ నజరానాగా దక్కింది. లింగమనేని గ్రూప్‌లో బాబు కుటుంబ సభ్యులకు వాటాలు బదిలీ అయ్యాయి.



బాబు - బినామీల భూముల్లో ఒక్క అంగుళం కూడా పోకుండా వాటికి సమీపంలోనే అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చక్రం తిప్పారు.

 

పరిహారం ఓ పచ్చి దగా

రాజధానికి భూమి ఇస్తే ఎకరానికి ఇంత పరిహారం ఇస్తామని, నివాస స్థలం, వాణిజ్య స్థలం ఇస్తామని ప్రకటించారు.



పరిహార ప్యాకేజీలో అనేక మార్పులు చేస్తూ వచ్చారు. భూమిని బట్టి ఏడాదికి రూ. 50 వేలు, రూ. 30 వేల చొప్పున పదేళ్లపాటు పరిహారమిస్తామన్నారు.



ఏ గ్రామంలోని వారికి ఆ గ్రామంలోనే ఇంటి స్థలం, వాణిజ్య స్థలం ఇస్తామన్నారు.



ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు.

 

రైతులకు తిరిగి ఇచ్చే నివాస, వాణిజ్య భూములు అత్యంత విలువైనవని, ఆ  భూములతో వారు కోటీశ్వరులు అవుతారని చెప్పారు.

రాజధాని రైతుల రెసిడెన్షియిల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు.

 

పరిహారంగా ఇస్తానన్న నివాస, వాణిజ్య స్థలాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఎక్కడ ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు.



మెట్ట భూములు, జరీబు భూములకు పరిహారం విషయంలో తేడాలున్నాయి. ఏవి ఏ రకం భూములనే దానిపై రైతులను నానా ఇక్కట్లకు గురిచేస్తున్నారు.



ఇపుడు భూములిచ్చేశాక గ్రామం పక్కనే కావాలంటే ఎలా అని అడుగుతున్నారు.



రాజధాని శంకుస్థాపన సమయంలో ఇళ్లు తొలగించినవారికి ఇప్పటికీ ప్రత్యామ్నాయం చూపలేదు.



రైతులకు తిరిగి ఇచ్చే భూముల్లో అధిక శాతం అంతగా విలువ లేని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వబోతున్నారు.



రెసిడెన్షియిల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలకు సంబంధించి పలు నిబంధనలు పెడుతున్నారు.

 

 కేసులు... బెదిరింపులు.. వేధింపులు

భూ సమీకరణ రైతుల ఇష్టపూర్వకంగా చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత అసలు స్వరూపాన్ని బైటపెట్టుకున్నారు.



భూములు ఇవ్వని రైతులను రకరకాలుగా వేధించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. పొలాలు తగులబెట్టించారు.  రైతులపైనే ఎదురుకేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు.



కొన్ని చోట్ల యజమానులకు తెలియకుండానే పొలాలను చదును చేసేశారు. భూమి ఎక్కడుందో తెలుసుకోలేక రైతులు కన్నీరుమున్నీరయ్యారు.



29 గ్రామాల్లో పంటలు వేయనీయలేదు. చివరకు హైకోర్టు జోక్యంతో అనుమతించినా వ్యవసాయం చేసుకోమంటూనే సహాయం నిరాకరించారు. వ్యవసాయ రుణాల మంజూరు నిలిపివేశారు. చివరకు భూసార పరీక్షలు కూడా చేయనివ్వలేదు.

 

దళిత రైతుల అసైన్డ్ భూములూ కైంకర్యం

రాజధాని ప్రాంతంలోని దళిత రైతుల అసైన్డ్ భూములను ఓ పథకం ప్రకారం దోచుకున్నారు.



ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాక్కుంటుందని ఊరూరా ప్రచారం చేయించారు.



తీవ్రంగా ఆందోళన చెందిన రైతులను మాటలతో మభ్యపెట్టి భయపెట్టి మోసం చేసి ఎకరా కనిష్టంగా రూ. 5 లక్షలకు కొనేశారు. 1,848 ఎకరాల అసైన్డ్ భూములను బాబు, ఆయన బినామీలు కారు చౌకగా కొట్టేశారు.



సాధ్యమైన మేర భూములన్నిటినీ కైంకర్యం చేసిన తర్వాత  అసైన్డ్ భూములకు పరిహార ప్యాకేజీని ప్రకటించారు.



దాంతో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన తెలుగుదేశం నాయకులంతా కోట్లలో లాభపడ్డారు. ఐదు లక్షల రూపాయలకు ఎకరం కొనుగోలు చేసిన వారికి ఇపుడు పరిహార ప్యాకేజీ వల్ల రూ. 1.90 కోట్ల వరకు లబ్ది చేకూరబోతోంది.

 

చివరకు మిగిలింది...

అమరావతి పేరు చెప్పి బాబు - బినామీలు లక్షల కోట్లు వెనకేసుకున్నారు.



మూడుసార్లు శంకుస్థాపనలు జరుపుకున్న రాజధాని ప్రాంతంలో చివరకు మిగిలింది దేశం నలుమూలల నుంచి వచ్చిన మట్టి ముంతలు... అపుడపుడు కొండెక్కి వెలుగుతున్న అఖండ జ్యోతి మాత్రమే..

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top