ఎవ్వలూ పట్టించుకోనేదు

ఎవ్వలూ పట్టించుకోనేదు - Sakshi


జగన్‌తో విన్నవించుకున్న తుపాను బాధితులు

 మేం చచ్చామో, బతికామో కూడా పట్టించుకోలేదని ఆవేదన

రాత్రి వేళల్లోనూ మారుమూల పల్లెల్లో సాగిన పర్యటన


 

కాకినాడ/ విశాఖపట్నం: పాకలన్నీ పడిపోనాయి... పడవలన్నీ పోనాయి... గంజినీళ్లు కూడా నేవు... పిల్లపాపలతో ఆకలితో చస్తున్నా మేమేటైపోనామని పట్టించుకోనాకి ఏలూ రానేదు... నువ్వొక్కడివే వచ్చావు బా బూ.. మీరు తప్ప మాకు న్యాయం చేసే వారేలేరు.. మేమెలా బతకాల నాయనా.. అంటూ హుదూద్ తుపాను బాధితులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు చూసి చలించిన జగన్ సర్కారు నిర్లక్ష్య ధోరణిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘‘ఈ ప్రభుత్వానికి, పాలకులకు వీసమెత్తు మానవత్వమైనా ఉందా? మూడురోజులుగా ప్రజలు పస్తులుంటే పట్టించుకోరా! వీళ్లసలు మనుషులేనా? తినడానికి గుప్పెడు మెతుకులు, తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం పలకరించడానికి కూడా రారా?’’ అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ని ర్వాసితులకు ప్రతి ఇంటికి రూ.5000 వెంటనే ఇవ్వాలి. దీంతో వారంతా తిండి, బట్ట కొనుక్కుంటారు. ప్రతి బోటుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలి. ఎన్నో వలలు కొట్టుకుపోయాయి. ప్రతి వలకు రూ.40 వేలు చెల్లించాలి. ఇళ్లు దెబ్బతిన్నవారికి అవసరాన్నిబట్టి కనీసం రూ.50 వేలు అందజేయాలి. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కొత్త ఇల్లు కట్టివ్వాలి’’ అని డిమాండ్ చేశారు. హుదూద్ తుపానుతో కకావికలమైన తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో ఆయన మంగళవారం పర్యటించారు.



హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జగన్ జగ్గంపేటలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా శాఖ సమకూర్చిన వాటర్ ట్యాంకర్లను జెండా ఊపి తుపాను బాధిత ప్రాంతాలకు పంపించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత, యలమంచిలి ని యోజకవర్గం నారాయణపురంలోని దివిలి జం క్షన్, అచ్యుతాపురం జంక్షన్ మీదుగా తుపాను తీరం దాటిన పూడిమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఉద్దపాలెం, తాళ్లదిబ్బ, పాపయ్యపాలెం, దుప్పితూరు, అచ్యుతాపురం, స్టీల్‌ప్లాంట్, గాజువాక మీదుగా రాత్రి 9 గంట లకు విశాఖ చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.



మీకు అండగా నేనుంటా...



 జగన్ పర్యటన ఆద్యంతం ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తుపాను తమకు తీరని నష్టం చేయగా అధికారులు అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. తుపాను తీరం దాటిన పూడిమడకలో జగన్‌ను చూడగానే మత్స్యకారులంతా బోరున విలపించారు. మూ డురోజులుగా తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. మీరు వస్తున్నారని తెలిసి ఈరోజు 8 కేజీల బియ్యం మాత్రమే కొందరికి పంపిణీ చేశారని వివరించారు. ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా తానున్నానంటూ జగన్ వారిని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. పూడిమడకతోపాటు కొండపాలెం, కడపాలెం గ్రామాల్లో కాలినడకన తిరిగి తుఫానుకు దెబ్బతిన్న బోట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పూడికమడక నుంచి చంద్రబాబును మనమంతా కలసి అడుగుదాం. అయ్యా చంద్రబాబునాయుడుగారూ! తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్టలు లేక తాగేందుకు నీరు లేక ఈ ప్రాంత ప్రజలు ఎలా బతుకుతా రు? ఈ ప్రాంతానికి జరిగిన తుపాను నష్టానికి ప్రభుత్వం మానవత్వంతో ముందుకు రావాలి. ఆదివారం రోజున తుపాను ఈ తీరాన్ని తాకిం ది. ఇవాళ మూడో రోజు. ఈ గ్రామానికి అధికారులు ఎవరైనా వచ్చారా? (రాలేదు రాలేదు అని స్థానికులు పెద్దపెట్టున నినాదాలుచేశారు) సీఎం చంద్రబాబు వస్తున్నారని చెప్పి బస్సులు పెట్టి మరీ జనాన్ని, అక్కా చెల్లెళ్లను అచ్యుతాపురం తీసుకుపోయారు. అచ్యుతాపురంలో ఏమైనా ఇచ్చారా? (ఇవ్వలేదు ఇవ్వలేదు అని స్థానికులు నినదించారు). అవే బస్సుల్లో ఊరికి వెనక్కి తీసుకువచ్చైనా దింపలేదు. మహిళలంతా నడుచుకుని గ్రామానికి తిరిగివచ్చారు. ఈ గ్రామానికి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి, మూడు గంటల ముందు ఎనిమిది కేజీల బియ్యం ఇచ్చారని ఇక్కడివారు చెబుతున్నారు. జగన్ రాకుండా ఉండి ఉంటే ఆ బియ్యమైనా ఇచ్చి ఉండేవారా? బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? చింతపండు లేదు. పప్పు లేదు.



చక్కెర లేదు. పాలు కూడా లేవు. కనీసం ఇప్పటికైనా కనికరం చూపండి’’ అని సర్కారును కోరారు. మీలో ఒక చెల్లెమ్మ ముందుకు వచ్చి చంద్రబాబును ఇక్కడి నుంచే డిమాండ్ చేయాలని కోరుతున్నా.. అని జగన్ పిలుపునివ్వగా సింహాచల మ్మ అనే మహిళ ముందుకు వచ్చి, తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది. ఈ పర్యటనలో పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు, శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు అమర్‌నాథ్, గురువులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 మమ్మల్ని చూసిన నాయకుడు జగన్ ఒక్కడే



నేను పక్కా తెలుగుదేశం. నీరు, వర్షం, గాలి ఒకేసారి చుట్టుముట్టి మా బతుకులను అధోగతిపాలు చేసినా అయ్యో పాపం అని ఎవ్వరూ పట్టించుకోలేదు. మేం ఓటు వేసి గెలిపించిన చంద్రబాబు మా ఊరుకు రానేలేదు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదు. అచ్యుతాపురం తీసుకెళ్లి వదిలేశారు. అక్కడనుంచి నడిచొచ్చాం. టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నా. మా గ్రామంలో తుపానుతో నష్టపోయిన అన్నీ చూసిన నాయకుడు జగన్.     - సింహాచలమ్మ, పూడిమడక, విశాఖ జిల్లా

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top