ఏడు అడుగులకు ఒక బెడ్... | Sakshi
Sakshi News home page

ఏడు అడుగులకు ఒక బెడ్...

Published Sun, Feb 2 2014 11:18 PM

one bed


 ఈ సాగు విధానంలో నేలను సిద్ధం చేసుకోవడం, మొక్కలు నాటడం కీలకమైనవి. అరెకరంలోనే వేయాల నేం లేదు. పావెకరంలోనూ.. వీలయితే ఎకరం పొలం లోనూ ఈ సాగు చేపట్టొచ్చు. ముందుగా పొలం చుట్టూ ఒకటిన్నర అడుగుల వెడల్పు, అర అడుగు లోతు కాలువ తవ్వుకోవాలి. తరువాత ఏడు అడుగులకు ఒక బెడ్(మట్టి పరుపు)ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు మట్టి పరుపుల మధ్య 2 అడుగుల వెడల్పు కాలువ తవ్వుకోవాలి. దీని వలన మట్టి పరుపు మీద పడిన నీరు అదనంగా నిలవ కుండా జారిపోతుంది. వర్షాకాలంలో నీరు తీసివేయ డానికి, ఎండాకాలంలో నీరు పెట్టడానికి వీలవుతుంది.
 
 కంపోస్టు లేదా చెరువు మట్టి + పశువుల ఎరువు..
 మట్టి పరుపు మీద వర్మీ కంపోస్టు, నాడెపు కంపోస్టు లేదా చెరువు మట్టి, పశువుల ఎరువు కలిపి ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందాన పరవాలి. మొదటి మట్టి పరుపు మీద మూడున్నర అడుగుల స్థలం వదిలి ప్రతి ముపై ్ప ఆరు అడుగులకు ఒకటి చొప్పున.. ఎత్తుగా ఎదిగే పండ్ల మొక్క (మామిడి, ఉసిరి, నేరేడు, పనస)ను నాటుకోవాలి. ఇవి అర ఎకరంలో దాదాపు పదహారు వరకు వస్తాయి. తరువాత ఈ మొక్కల మధ్య ప్రతి 18 అడుగులకు ఒకటి చొప్పున జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి లాంటి మొక్కలు నాటుకోవాలి. ఆ తరువాత ప్రతి తొమ్మిది అడుగుల దూరానికి ఒకటి చొప్పున పెద్దగా కొమ్మలు రాని బొప్పాయి, అరటి లాంటి మొక్కలు నాటుకోవాలి. వీటి మధ్య ఒక పావు ఎకరంలో పలు రకాల కూరగాయ విత్తనాలు విత్తుకోవాలి.
 
 ‘మా పిల్లలు మంచిగా తింటున్నారు’
 మావన్నీ మెట్ట భూములు వానలు లేక ఏం పండేది కాదు. నేను ఒంటరిదాన్ని. ఇద్దరు పిల్లల్ని ఎలా చదివించాలా అని బాధపడేదాన్ని. పారినాయుడు సారు అన్నపూర్ణ పద్ధతి బాగుంటదని చెపితే, అరెకరంలో పంటలు, పండ్ల మొక్కలు వేసుకున్నాం. మా పిల్లలు మంచిగా తింటున్నారు. ఈ సీజన్‌లో రూ.25,500 ఆదాయం కూడా వచ్చింది.
 - కమలకుమారి, పెంగువ, గుమ్మలక్ష్మీపురం మండలం
 
 కడుపు నిండా తింటున్నాం!
 ఇంతకు మునుపు ఏడాదంతా పనిచేసినా డబ్బులకు ఇబ్బందిగా ఉండేది. 13 జాతుల విత్తనాలు వేశాం. ‘అన్నపూర్ణ’ వల్ల మేం కడుపునిండా తింటున్నాం. ఈ పంటకాలంలో (4-5 నెలలు) మేం తిన్నది కాక రూ.32,500 ఆదాయం వచ్చింది.
 - చంద్రమ్మ, మర్రిగూడ, కురుప మండలం
 
 ఇతర రాష్ట్రాల్లోనూ అమలు..!
 ‘అన్నపూర్ణ’ సాగు పద్ధతి పేద రైతులకు చాలా ఉపయోగకరం. వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా పంటలు పండించడానికి ఈ పద్ధతి చాలా అనువైనది. కేవలం అర ఎకరంలో బహుళ పంటల సాగుతో సంవత్సరం పొడవునా రైతుకు ఆహారం, ఆదాయం సమకూరడం ఇందులో చాలా కీలకమైనవి. సెర్‌‌ప ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న దీన్ని ఇతర రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాల ద్వారా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.    
 - విజయ్‌కుమార్,
 సంయుక్త కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ,  
 డెరైక్టర్, జాతీయ గ్రామీణాభివృద్ధి మిషన్

Advertisement
Advertisement