ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు

ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు - Sakshi


- సంస్థ ఏర్పాటుపై ఉమా, ప్రత్తిపాటి పట్టు

- సీఎం వద్ద ఉమా మంత్రాంగం




సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలో ముఖ్య శాఖలకు సంబంధించిన ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు రగులుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను మా జిల్లాకు కావాలంటే.. మా జిల్లాకు కావాలంటూ.. ఇద్దరు మంత్రులూ పట్టుపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎయిమ్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం పలు విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లను ప్రధాన నగరాలైన కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కొక్కటి కేటాయించింది. అలాగే, విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.



ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుబడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి ఉన్నందున రెండు ప్రాంతాలకూ అనుకూలంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో కేంద్ర బృందం కూడా త్వరలోనే స్థల పరిశీలన చేయనుంది. మరోవైపు ఎయిమ్స్‌ను ఎలాగైనా విజయవాడలోనే పెట్టించాలనే ఆలోచనతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది.



నగరంలో దానిని ఏర్పాటుచేస్తే విజయవాడ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది ఉమా అభిప్రాయం. జనాభా ఎక్కువగా ఉండడం, రాజధానికి అనువైన ప్రదేశం అయినందున విజయవాడలోనే నెలకొల్పాలని ఆయన సీఎం వద్ద పట్టుబడుతున్నారు. దీంతో రాజకీయంగా మంత్రులిద్దరి మధ్య దూరం బాగా పెరుగుతున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మంత్రులు ఇలాంటి పట్టుదలలకు పోతే రేపు రాబోయే ప్రాజెక్టులపై ఎలాంటి వివాదాలు నెలకొంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top