సీఎం చంద్రబాబుకు మంత్రి ఝలక్

సీఎం చంద్రబాబుకు మంత్రి ఝలక్ - Sakshi


పుష్కరాల కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చ

దేవాదాయ మంత్రి, అధికారులపై సీఎం అసంతృప్తి

దీటుగా స్పందించిన మంత్రి మాణిక్యాలరావు

మాకు సంబంధం లేకుండా కార్యక్రమాలు

చేపడుతూ మమ్మల్ని నిందించడం సరికాదని వ్యాఖ్య

మంత్రి ప్రశ్నకు సమాధానమివ్వలేక మౌనం దాల్చిన చంద్రబాబు



హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మిత్రపక్షమైన బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు షాకిచ్చారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గోదావరి పుష్కరాల నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు రోజుల కిందట రాజమండ్రిలో నిర్వహించిన అఖండ హారతి కార్యక్రమానికి అంతగా ప్రచారం రాలేదని, అందుకు ఏర్పాట్లు చేయకపోగా సరిగా నిర్వహించలేదంటూ అధికారులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.



దీనికి మంత్రి దీటుగా సమాధానమిచ్చి సీఎంని షాక్‌కు గురిచేసినట్టు సమాచారం. పుష్కరాల కార్యక్రమాలు పేరుకు మాత్రమే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, ఏ కార్యక్రమంలోనూ తమ శాఖకు పాత్ర ఉండటంలేదని మంత్రి సమాధానమిచ్చినట్లు తెలిసింది. పుష్కరాలకు సంబంధించి మొత్తం పనులు, బాధ్యతలు మీ సొంత పార్టీకి చెందిన మంత్రులకు అప్పగించి సరిగా జరగడం లేదని తమను నిందించడంలో అర్థం లేదని మాణిక్యాలరావు అన్నట్లు సమాచారం. పుష్కరాలపై వేసిన కమిటీలన్నింటినీ తనకు సంబంధం లేకుండా నియమించారని, అలాంటప్పుడు తమను తప్పుబట్టడం సరికాదని ఆయన సూటిగా చెప్పడంతో చంద్రబాబు సమాధానమివ్వలేక మౌనం దాల్చారు.



కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మొదటి నుంచీ చెబుతున్న చంద్రబాబు, పుష్కరాల కార్యక్రమాలు వేటిలోనూ దేవాదాయ శాఖను భాగస్వామ్యం చేయలేదు. పైగా పుష్కరాల కోసం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలో ఒక కమిటీని, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మరో కమిటీని, మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించారు. వీటిలోనూ దేవాదాయ శాఖ మంత్రికి భాగస్వామ్యం లేదు. వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ మాణిక్యాలరావు ప్రమేయం లేదు.



ఆఖరుకు పుష్కరాల లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కేవలం గంట ముందు మంత్రికి సమాచారమిచ్చారు. అప్పటివరకు ఒక లోగో తయారు చేస్తున్నారన్న సమాచారం కూడా మంత్రికి లేదు. మరోవైపు పుష్కరాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశాలకూ తగిన సమయంలో సమాచారమివ్వకపోగా, మాణిక్యాలరావును దాదాపుగా దూరం పెట్టారు. ఇంతకాలం ఇవేవీ పట్టించుకోనప్పటికీ, కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమేంటని మంత్రి మాణిక్యాలరావు దీటుగా సమాధానం చెప్పడంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారని తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top