ఏపీ రాజధాని గుంటూరు - విజయవాడే | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధాని గుంటూరు - విజయవాడే

Published Wed, Jul 16 2014 2:08 AM

ఏపీ రాజధాని గుంటూరు - విజయవాడే - Sakshi

 ఏపీ రాజధానిపై కేంద్ర కమిటీకి రాష్ట్ర సర్కారు ఆప్షన్
 అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ అక్కడే
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని గుంటూరు - విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ మేరకు రాజధాని ప్రాంతం ఎంపికపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీకి కూడా తన అభిప్రాయాన్ని తెలియచేసింది. ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మధ్యలో ఉండడం.. రోడ్డు, రైల్వే, విమాన మార్గాల అనుసంధానంతో పాటు కృష్ణా నదికి రెండు వైపులా ఉండడం వల్ల మంచినీటికి కొరత ఉండదని కమిటీకి నివేదించింది. అయితే కేంద్రం దీనిపై తీసుకొనే తుది నిర్ణయాన్ని అనుసరించి రాజధాని నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టనుంది. శాఖాధిపతుల కార్యాలయాలు, డైరక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలను, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులను రాజధానిగా ఎంపికయ్యే ప్రాంతంలోనే నెలకొల్పాలని.. ఆ మేరకు ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
 
 సింగపూర్ వెళ్లనున్న కమిటీ...
 
 విజయవాడ, గుంటూరులతో పాటు పలు జిల్లాల్లో ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న ప్రభుత్వం వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయింపులు చేస్తోంది. రాజధాని ప్రాంతంలో భూముల అందుబాటును అనుసరించి ఈ ప్రణాళికలు రూపొందించనున్నారు. మరో వందేళ్లలో రానున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. త్వరలోనే ఈ కమిటీ సింగపూర్ వెళ్లి రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేస్తుంది. సమగ్ర ప్రణాళిక రూపకల్పనకోసం పురపాలక శాఖ ఉన్నతాధికారులను కొన్ని రోజుల పాటు సింగపూర్లోనే ఉంచనున్నారు. ఇప్పటికే రెండు మూడు నమూనాలను కూడా సిద్ధంచేయించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని పెంచి దాని చుట్టూరా 184 కిలోమీటర్ల మేర ఔటర్ రింగురోడ్డును నిర్మించనున్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో భవనాల నిర్మాణానికి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు.
 
 ఐదు నుంచి పదేళ్లు పడుతుంది: నారాయణ
 
 రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ఐదు నుంచి పదేళ్లు పడుతుందని అంచనావేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం మీడియాతో పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement