Breaking News

బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?

Published on Sat, 08/01/2026 - 13:55

షెహజాద్‌ పూనావాలా.. బీజేపీకి  పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

షెహజాద్‌ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్‌ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్‌ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్‌ బయోలో మోదీకి తాను “లైఫ్‌ లాంగ్‌ ఫాలోవర్‌” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.

జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?
షెహజాద్‌ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్‌ పేపర్‌ లీక్‌, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎవరీ షెహజాద్‌ పూనావాలా?
1987 అక్టోబర్‌ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్‌ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్‌ పూనావాలా, తల్లి యాస్మిన్‌ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్‌ అనుకూల వాదిగా పేరున్న తహసీన్‌ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్‌ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.

కాంగ్రెస్‌లో పంచాయితీతో.. 
షెహజాద్‌ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.

బీజేపీకి బలమైన వాయిస్‌.. 
బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్‌ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.

ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..
షెహజాద్‌ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్‌ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్‌ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్‌ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?
రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్‌ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్‌ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.

కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నెక్ట్స్‌ ఏంటి?
బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్‌ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్‌ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)