CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
Published on Fri, 01/30/2026 - 12:49
రీసెంట్ టైంలో మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'సర్వం మాయ'. హీరో నివీన్ పౌలీ.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. హిట్ కొట్టాడు. హారర్ కామెడీ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)
కథేంటి?
ప్రభేందు(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుర్రాడే కానీ దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. అనుకోని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్నివదిలిస్తాడు. తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభేందు వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతూ ఉంటుంది. సదరు దెయ్యానికి.. తాను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేం గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. మరి డెలులు వల్ల ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
మలయాళ సినిమాల్లో పెద్దగా కథేం ఉండదు. సింపుల్ ఎమోషన్స్, సున్నితమైన కామెడీతోనే అంతా నడిపించేస్తుంటారు. ఇది అలాంటి ఓ స్టోరీనే. సాధారణంగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో దెయ్యమే.. మనుషుల్ని చూసి భయపడుతుంది. గతం మర్చిపోవడం వల్ల పేరు సహా ఏదీ గుర్తుండదు. ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. హీరో కూడా అంతే. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఎలా సాయం చేసుకున్నారు. ప్రభేందు తన భయాన్ని ఎలా అధిగమించాడు. డెలులు చివరకు ముక్తి పొందిందా లేదా అనేది మెయిన్ ప్లాట్.
హారర్ కామెడీ సినిమానే అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే సీన్స్ ఉండవు. బదులుగా ఆడ దెయ్యంతో ప్రేమలో పడతాం. ప్రేమ, బంధం, నమ్మకం లాంటి విషయాల గురించి పలు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్, ఆయా సీన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి. మూవీ చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఫస్టాప్ చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం అక్కడక్కడే తిరిగినట్లు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే డెలులు దెయ్యం ఉన్న ప్రతి సీన్ క్యూట్ అండ్ స్వీట్‌గా భలే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌కి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే ఇంత సింపుల్‌గా తేల్చేశారేంటా అనిపిస్తుంది.
ప్రభేందుతో పాటు ట్రావెల్ అయ్యే డెలులు దెయ్యం.. చివరకు అతడితోనే ప్రేమలో పడటం, అదే టైంలో ప్రభేందు.. సాధ్య అనే అమ్మాయిని ప్రేమించడం. తద్వారా ప్రభేందు-డెలులు మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలో డెలులు గతం గుర్తొచ్చే సీన్స్ బాగుంటాయి. డెలులు నిజ జీవితంలోనూ ప్రభేందునే ప్రేమించిందా? అనే ప్రశ్నతో సినిమాని ముగించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ప్రభేందుగా చేసిన నివీన్ పౌలీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. డెలులు దెయ్యంగా చేసిన రియా షిబు అయితే ప్రతిఒక్కరి ఫేవరెట్ అయిపోతుంది. అంత క్యూట్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేసింది. మిగతా యాక్టర్స్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ అనవసరంగా ఉందే అని ఎక్కడా అనిపించదు. చివరకు కుక్కని కూడా కథలో భాగం చేసిన తీరు అలరిస్తుంది. టెక్నికల్ విషయాలకొస్తే.. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ పాటలకు రాసిన తెలుగు లిరిక్స్ అస్సలు సూట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా చూడముచ్చటగా ఉంది. కేరళ అందాలని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
దెయ్యం లేదా హారర్ సినిమాలు చూడాలంటే మీకు చచ్చేంత భయమా? అయినా పర్లేదు. ఎలాంటి భయం లేకుండా మీరు ఈ మూవీ చూసేయొచ్చు. చూస్తున్నంతసేపు దెయ్యమేంటి ఇంత అందంగా ఉంది? ఇలాంటిది మన జీవితంలోకి ఎందుకు ఎప్పుడూ రాలేదు? అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'సర్వం మాయ' బెస్ట్ ఆప్షన్. కుటుంబంతోనూ కలిసి హాయిగా చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం)
Tags : 1