Breaking News

పెరుగుతున్న చైనా ప్రాబల్యం

Published on Thu, 05/29/2025 - 00:48

పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై భారత్‌ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. 

ఈసారి భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్‌ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. 

కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.

ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యా
ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. 

ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్‌ స్థానాన్ని బీజింగ్‌ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. 

ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్‌ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్‌ ఘర్షణలో ప్రధానాంశం.

అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసి
ఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. 

పాకిస్తాన్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్‌ ఏం చెప్పిందో, భారత్‌–పాక్‌ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్‌ సమతూకం పాటించినట్లు గానే, భారత్‌–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. 

దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్‌ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. 

దానర్థం – భారత్‌ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. 

బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్‌ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. 

ఒంటరిగానే పోరాడగలగాలి!
ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. 

ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్‌ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. 

ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. 

జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.

ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్‌ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్‌ సమీక్షా కమిటీ తరహాలో పహల్‌గామ్‌ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. 

చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టే
విధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్‌ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. 

ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్‌ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్‌ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్‌!

హ్యాపీమాన్‌ జాకబ్‌ 
వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)