Breaking News

వడివడిగా ఏఐ దిశగా...

Published on Tue, 02/17/2026 - 00:39

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్‌ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్‌–విస్తార్‌ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్‌ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్‌విడియా, బ్లాక్‌స్టోన్‌ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. 

ట్రంప్‌ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 

1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్‌ జీపీటీ మోడల్‌ను తీసుకొచ్చిన సామ్‌ ఆల్ట్‌మాన్‌ ఆధ్వర్యంలోని ఓపెన్‌ ఏఐ... నిరుడు జనవరిలో డీప్‌సీక్‌ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్‌సీక్‌పై భారీ స్థాయి సైబర్‌ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్‌సీక్‌ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్‌ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్‌ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్‌ 3.5 సానెట్, క్లాడ్‌ 3 ఓపస్‌ మోడళ్లు చాట్‌ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. 

ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్‌ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. 

మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్‌ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్‌ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)