Breaking News

శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!

Published on Sun, 09/20/2026 - 08:00

పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.

శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.

కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.

వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.

‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. 

అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.

‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.

‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.
‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.

పురావిశేషం..
ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.
- సాంఖ్యాయన

ఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు?

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)