హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు
Breaking News
ఈ వారం కథ: 'ఆత్మబలం'
Published on Sun, 09/06/2026 - 11:27
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.
‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’
‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.
మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.
మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.
యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి.
అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.
అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.
ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతో
శాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.
‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.
‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.
‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..
‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.
‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.
కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..
‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.
∙∙
‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’
‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.
‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.
‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.
‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.
‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.
ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’
‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.
‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్‌కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.
‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.
‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.
∙∙
ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్‌కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.
‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.
‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...
‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.
‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్‌కు సిద్ధమయ్యాడు రాఘవ.
బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.
పైనుంచి నాన్న...
‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ.
‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.
లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...
‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.
‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.
అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.
∙∙
‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.
‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.
‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.
‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్‌తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.
‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.
‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ.
మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.
∙∙
ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ.
‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.
‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.
కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.
అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.
‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.
‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.
మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే
‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.
‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.
- మంత్రిప్రగడ శ్రీనివాసరావు
ఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ
Tags : 1