లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Breaking News
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
Published on Wed, 04/08/2026 - 07:26
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్‌పై తలపెట్టిన సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2 శాతంపైగా లాభపడటం భారత మార్కెట్లలో బుల్ రన్‌కు సంకేతాలు పంపుతోంది.
ట్రంప్ వ్యూహాత్మక అడుగు
ఏప్రిల్ 8, 2026 ఉదయం 4:30(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వినాశకరమైన యుద్ధం కంటే శాంతికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అయితే హార్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరిస్తేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
చమురు ధరల పతనం..
యుద్ధం వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ దాదాపు 18 శాతం తగ్గి 92.60 డాలర్లు వద్దకు చేరింది. బ్రెండ్ క్రూడ్ 6 శాతం తగ్గి 103.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటం వల్ల సరఫరా పునరుద్ధరిస్తారనే ఆశలు చిగురించాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతానికి పైగా ఈ మార్గం నుంచే సాగుతుండటంతో గడిచిన నెల రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు కిందికి దిగివస్తున్నాయి.
దలాల్ స్ట్రీట్‌లో పండగ
భారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్ల పైగా లాభంతో ఉంది. దీని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు చారిత్రాత్మక గరిష్టాలను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్‌లో నికాయ్, హాంగ్ సెంగ్ మార్కెట్లు ఇప్పటికే 2-3 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇంతకాలం యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళనతో నగదును వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప ఊరట. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేస్తే ఈ రెండు వారాల విరామం శాశ్వత శాంతికి దారి తీయవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు చమురు ధరల తగ్గింపు బూస్టర్ డోస్ లాంటిది. అయితే, ఇది కేవలం రెండు వారాల గడువు మాత్రమేనని, మధ్యవర్తిత్వ చర్చల ఫలితాలను బట్టే మార్కెట్ల తదుపరి దిశ ఉంటుందని పెట్టుబడిదారులు గమనించాలి.
ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
Tags : 1