ఫోన్‌ ట్యాపింగ్‌ హెడ్‌క్వార్టర్‌ ఎక్కడ అంటే..

- - Sakshi

సిరిసిల్ల హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం

జిల్లా కేంద్రంగా వార్‌ రూంను గుర్తించిన పోలీసులు

స్థానిక నేత ఇచ్చిన నంబర్లు ఇక్కడి నుంచే ట్యాప్‌

12న డీఎస్పీ ప్రణీత్‌రావు ఇక్కడే అరెస్టు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బాధితులు?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్‌లోని ఎస్‌ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్‌లో ఎస్‌ఐబీ పోలీసులు కొందరు వార్‌ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. వరంగల్‌లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్‌ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్‌ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్‌ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్‌ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్‌ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్‌ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం.

వార్‌ రూం ఎంతకాలం నడిచిందో?

గత డిసెంబర్‌ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్‌రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్‌ రూంలోని దాదాపు 50 హార్డ్‌ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్‌రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్‌ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్‌ రికార్డ్‌ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్‌ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్‌ చేసిన కాల్స్‌లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్‌రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్కుల్లో సిరిసిల్ల కాల్‌ రికార్డ్స్‌ కూడా ఉన్నాయని సమాచారం.

సిరిసిల్లకే పరిమితం కాలేదా?

వార్‌ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్‌, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్‌కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్‌ పరికరాలను ఓ వ్యాన్‌లో పెట్టుకొని, టార్గెట్‌ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్‌ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్‌ కూడా వినే వీలుంటుంది.

2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్‌

2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్‌ కట్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్‌ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అనుమానించారు.

Election 2024

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top