అసమానతల భారతం

Sakshi Editorial On India of inequalities

ప్రపంచం ముందుకు పోతోంది... దేశం శరవేగంతో సాగిపోతోంది... అని పాలకులు భుజాలు ఎగరేస్తున్న వేళ కళ్ళు తిరిగే గణాంకాల లెక్క ఇది. అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కొందరు అంతెత్తున ఉంటే, అనేకులు అధఃపాతాళంలోనే ఉన్నారని తేలింది. భారతదేశంలో ఆదాయం, సంపదల్లో అస మానతలు గడచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తారస్థాయికి చేరాయని ‘వరల్డ్‌ ఇనీక్వా లిటీ ల్యాబ్‌’ అధ్యయన పత్రం వెల్లడించింది.

నోబెల్‌ బహుమతి గ్రహీత థామస్‌ పికెట్టీ సహా నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రూపొందించిన ఈ పత్రం ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపింది. ఆదాయ అసమానతలో మన దేశం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలను సైతం వెనక్కి నెట్టేసింది. బ్రిటీషు పాలనలో కన్నా ఇప్పుడే భారత్‌లో అసమానతలు ఎక్కువయ్యా యట. ఇది ఆందోళన రేపుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. 

‘భారతదేశ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల రాజ్య ఆవిర్భావం’ అనే ఈ పత్రం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2000ల నుంచి దేశంలో అసమానతలు తారాపథానికి దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశ సంపదలో 40 శాతం పైగా కేవలం ఆర్థిక బలసంపన్నులైన అగ్రశ్రేణి 1 శాతం మంది దగ్గరే పోగుబడింది. దేశ ఆదాయం లెక్కన చూస్తే 22.6 శాతం ఈ కొందరి వద్దే ఉంది. ఇక, కింది 50 శాతం జనాభా జాతీయ ఆదాయం మాత్రం 15 శాతమే.

వెరసి, గడచిన ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్టు అత్యధిక స్థాయిలో ఒకేచోట సంపద పోగుబడుతోంది. మరో ముఖ్య విషయమేమంటే, భారత్‌లో ఆర్థిక సమాచార నాణ్యత అంతంతే గనక వాస్తవిక అసమానతా స్థాయులతో పోలిస్తే పత్రంలో పేర్కొన్న అంచనాలు ఇంకా తక్కువేనట. పైనున్న వర్గాలు పైపైకి పోతుంటే, కింది వర్గాలు ఇంకా కిందకు పోయేలా ఆర్థిక అసమానతలు పెరగడం ఆందోళన రేపుతోంది. సమాజంలో అశాంతి, అస్థిరత పెచ్చరిల్లే ముప్పుంది.  

ఇలాంటి అంతర్జాతీయ నివేదికలే కాదు దేశంలోని స్థానిక నివేదికలు సైతం అసమానతల్ని పట్టిచూపుతున్నాయి. కర్ణాటకలోని ప్రగతివాద బృందాల సమ్మేళనమైన ‘బహుత్వ కర్ణాటక’ సైతం దేశంలో, ముఖ్యంగా కన్నడ సీమలో పెరుగుతున్న ఆదాయ అసమానతల్నీ, ఉపాధి రంగంలోని ఆందోళనకరమైన ధోరణుల్నీ ఈ మధ్యే తన నివేదికలో వివరించింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి, ఆదాయ సమానత అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘గ్యారెంటీ’ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని వెల్లడించింది.

నిజానికి, కేంద్రంలోని ప్రస్తుత పాలకులు పదేళ్ళ క్రితం అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల అజెండాతో గద్దెనెక్కారు. తమ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వంతున వృద్ధి చెందిందనీ, ముఖ్యంగా 2023లో ఆఖరి మూడు నెలల్లో అత్యంత వేగంగా ఈ పురోగతి సాగిందనీ వారు జబ్బలు చరుస్తున్నారు. అయితే, వారు అధికారంలో ఉన్న ఈ రెండుసార్లలోనే బీద, గొప్ప తేడా బాగా పెరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. పైపెచ్చు, ఢిల్లీ సర్కార్‌ శతకోటీశ్వరులకు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు సరేసరి. 

గమనిస్తే 1991నాటి ఆర్థిక సరళీకరణ ఆసరాగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 1991లో వారి సంఖ్య కేవలం 1 కాగా, 2022 నాటికి 162కు పెరిగిందని ఫోర్బ్స్‌ పత్రిక కథనం. పికెట్టీ తాజా పత్రం ఫోర్బ్స్‌తో పాటు పలు పత్రికలనూ, ఇతర అధ్యయనాలనూ ఉటంకించింది. అవన్నీ దేశంలో ధనికులకూ, గ్రామీణ నిరుపేదలకూ మధ్య అంతరం పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి.

అయితే, ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటనే మాట సత్యదూరమనే వారూ లేకపోలేదు. పికెట్టీ అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, అసమానతల్ని పెంచి చూపేలా ఫోర్బ్స్‌ వగైరా నుంచి సంపన్నుల జాబితాలను ఎంచుకుంటున్నారనీ దశాబ్ద కాలంగా విమర్శకుల అభ్యంతరం. అయితే ఎంత ఎక్కువనే మాట పక్కనపెడితే... దేశంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయనేది ఎవరూ కాదనలేనిది. వాటిని తగ్గించడానికి ప్రయత్నించడమే కర్తవ్యం.  

దారిద్య్రాన్ని తగ్గించడానికి వీలుగా వృద్ధిపై పెట్టడం వల్ల ఇటు ఆదాయ, సంపదల్లో అసమాన తలు పెరిగినప్పటికీ అదే పంథాను అనుసరించాలా అన్నది మరో ప్రాథమిక ప్రశ్న. 1960 – 80ల మధ్య పై శ్రేణిలోని 10 శాతంతో పోలిస్తే, దిగువనున్న 90 శాతం మంది గణనీయంగా వృద్ధి సాధించారు.

ఆర్థికసరళీకరణ అనంతరం మాత్రం మిగతా జనాభా కన్నా అగ్రశ్రేణి వర్గమే పైకెదిగింది. ఇక, 2014–2022 నడుమ దిగువ 50 శాతంతో పోలిస్తే, మధ్య 40 శాతం జనాభా వృద్ధి నిదానించింది. అగ్రస్థాయి 10 శాతం వారి పురోగతేమో ఆపలేని వేగం అందుకుంది. ధనిక, పేద తేడాకు ఇది ప్రధాన కారణం. మొత్తానికి గత దశాబ్దిన్నరలోనే అసమానతలు హెచ్చాయనేది నిర్వివాదాంశం. 

శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని గుర్తిస్తే... ఆర్థిక వ్యత్యాసాల్ని చక్కదిద్దడానికి తాజా పత్ర రచయితలు చేసిన కొన్ని విధాన సూచనల్ని కొట్టిపారేయలేం. సంపద పంపిణీ దృష్ట్యా చూస్తే, పేదలతో పోలిస్తే ధనికులు తక్కువ పన్నులు కట్టే ఇప్పటి విధానంలో మార్పు తేవాలి. ఆదాయం, సంపదలు రెంటినీ పరిగణించేలా పన్ను షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించి, భారత్‌లోని బిలియనీర్ల పైన సూపర్‌ ట్యాక్స్‌ విధించాలని వారు సూచిస్తున్నారు.

అలాగే, బీదాగొప్ప తేడాల్ని తగ్గించేందుకు వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించాలి. స్వల్పకాలిక వరాల కన్నా సుస్థిర, దీర్ఘకాల దారిద్య్ర నిర్మూలన పథకరచన సాగించాలి. సంక్లిష్టమైన ఈ వృద్ధి, దారిద్య్రం, ఆర్థిక అసమానత లాంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య భారతం ధనికస్వామ్యంగా మారితేనే కష్టం, నష్టం.  

Election 2024

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top