Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

మినీ మహా సంగ్రామం

Sakshi | Updated: January 05, 2017 00:01 (IST)
మినీ మహా సంగ్రామం

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తాలు ఖరారయ్యాయి. వచ్చే నెల 11తో మొదలై మార్చి 8 వరకూ వివిధ దశల్లో జరిగే ఈ ఎన్నికలకు బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. మొత్తంగా రెండు నెలలకు పైగా సాగే ఈ సమరం హోరాహోరీగా ఉండ బోతున్నదని ఇప్పటికే అర్ధమవుతోంది.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృ త్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఒకరకంగా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య.

పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం దాని ముందున్న ప్రధాన లక్ష్యం. ఆ రాష్ట్రం అనేక విధాల బీజేపీకి ప్రతిష్టాత్మకమైంది. అది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. 80 ఎంపీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు 71 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇక పంజాబ్, గోవాలు చిన్న రాష్ట్రాలైనా ప్రస్తుతం అధికారంలో ఉండటం వల్ల ఆ రెండూ కూడా బీజేపీకి ముఖ్యమైనవే. పంజాబ్‌లో అకాలీదళ్‌తో కలిసి వరసగా రెండో దఫా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్‌ నెగ్గుకొస్తుందన్న భయం బీజేపీకి లేకపోయినా...ఆప్‌ను ఎదుర్కొ నడం దానికొక సవాలు. వీటిని నిలబెట్టుకోవడంతోపాటు ఉత్తరాఖండ్‌ను, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను చేజిక్కించుకోవడం బీజేపీకున్న ఇతర లక్ష్యాలు.
 
నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఏర్పడ్డ పరిస్థితుల నేప థ్యంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలమన్న విశ్వాసం అటు విపక్షాల్లో ఉంది. నిజానికి ఈ పరిణామం జరగకపోయి ఉంటే పంజాబ్‌ మినహా యూపీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు చాలా సునాయాసంగా ఉండేది. ఉత్తరప్రదేశ్‌లో అధి కారంపై ఆశలు పెట్టుకున్న బీఎస్‌పీతో నువ్వా నేనా అన్నట్టు తలపడేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటిపై అందరి లోనూ ఆసక్తి, ఉత్కంఠ పెరిగాయి. ఇండియా టుడే తాజా సర్వే యూపీలో బీజేపీ ఓట్ల శాతం 31 నుంచి 33 శాతానికి పెరిగిందని, సమాజ్‌వాదీ ద్వితీయ స్థానంలో ఉన్నదని చెబుతున్న నేపథ్యంలో సహజంగానే అందరి దృష్టీ ఆ రాష్ట్రంపై పడింది. అక్కడ ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ భరితమే. మణిపూర్‌ చిన్న రాష్ట్రమైనా అక్కడి ఎన్నికల బరిలో దిగనున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ సర్కారును పడగొట్ట      బోయి భంగపడిన బీజేపీ ఎన్నికల్లో ఏం సాధిస్తుందో చూడాలి.

తమ డబ్బు కోసం దేశ ప్రజలంతా ఇప్పటికీ బ్యాంకుల ముందూ, ఏటీఎంల ముందూ క్యూ కట్టడం... అట్టడుగు వర్గాలకు చెందినవారి ఉపాధి దెబ్బతినడం... వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు ఇబ్బందుల్లో పడటం... మొత్తంగా తమ కనీసావసరాలపై కూడా ప్రజానీకం కోత విధించుకోక తప్పని స్థితి ఏర్పడటం వంటివి బీజేపీ నేతలకు ప్రతికూలాంశాలే. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించినాడు, ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించిన మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలు సైతం రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో నిరాశకు లోనయ్యాయి. ఈ వ్యవహారంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తవచ్చునో ముందే అంచనా వేసుకుని దానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకోలేకపోవడం రిజర్వ్‌బ్యాంక్‌ అసమర్ధతేనన్న ప్రచారం జరిగినా దాన్ని ఎవరూ స్వీకరించలేకపోయారు. అటు వెనక్కొచ్చిన పెద్ద నోట్ల లెక్కలు చూస్తే ఈ చర్యతో నల్లడబ్బును అంతం చేస్తామన్న కేంద్రం హామీ నెర వేరేలా లేదు. ఇలాంటి అనిశ్చిత స్థితిలో తమ చర్యను, దానివల్ల దేశానికి కలిగిన, కలగబోయే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీ అగ్ర నేతలపై పడింది. ఈ విషయంలో వారు ఏమేరకు కృతకృత్యులవుతారో చూడాల్సి ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ అయోమయంలో ఉంది. ఇటు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా ఆ పార్టీ చీలుతుందా, ఐక్యంగా నిలబడుతుందా అన్నది తేలలేదు. రాజీ యత్నాలు రోజుకో మలుపు తిరిగి ప్రజలు కూడా అయో మయంలో పడే స్థితి ఏర్పడింది. ములాయం సింగ్‌ను అఖిలేశ్‌తోసహా పార్టీలో అందరూ ‘నేతాజీ’ అని గౌరవిస్తున్నా... నేతగా మాత్రం అఖిలేశ్‌ను మాత్రమే గుర్తి స్తున్నారు. ఆయనతోనే తమ భవిష్యత్తు ముడిపడి ఉన్నదని విశ్వసిస్తున్నారు. ములాయం వెనకున్న నేతలతో అఖిలేష్‌ సర్దుకుపోవడం కంటే... వారితో బంధాన్ని తెంచుకుంటేనే ప్రయోజనం ఉంటుందని జోస్యం చెబుతున్నవారున్నారు.

అఖిలేష్‌ మాత్రం ఇంకా నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి గనుక ఆ గందరగోళం సమసిపోతుందని భావించాలి. చిత్రమేమంటే ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఆశాజనకమైన పరిస్థితి లేదు. బీజేపీపై ఏమైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు వెళ్తుంది తప్ప కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరబోదని చెబుతున్నారు. పంజాబ్‌ లోనైనా, గోవాలోనైనా పాలక పక్షాలపై ఉన్న వ్యతిరేకత నిన్న మొన్న పుట్టిన ఆప్‌కు లాభిస్తుందన్న అంచనాలున్నాయి. మూడేళ్లక్రితం దేశాన్నేలిన పార్టీని ఇంత దిక్కు మాలిన స్థితిలో పడేసిన ఘనత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు దక్కుతుంది.

ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. శాంతిభద్రతల రీత్యా పలు దశల్లో ఎన్నికలు తప్పనిసరైనా రెండు నెలల సుదీర్ఘ కాలం జనమంతా ఎన్నికల జాతరలో ఉండాల్సిరావడం సరైందేనా? సుదీర్ఘ ఎన్ని కల ప్రక్రియ వల్ల పార్టీలు చేసే వ్యయం మాత్రమే కాదు... ప్రభుత్వ వ్యయం కూడా ఆకాశాన్నంటుతుంది. పైగా ఒకే దశలో ఎన్నికలు పూర్తయ్యే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌ లాంటి రాష్ట్రాలు ఫలితాల కోసం దాదాపు నెలరోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అవసరమా అన్నది ఆలోచించాలి. మొత్తానికి మినీ మహా సంగ్రామంగా భావించే ఈ ఎన్నికల్లో వెలువడే తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడింది.
 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

డీప్‌..డీప్‌..డిప్రెషన్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC