
శిరీష మృతి కేసులో తేజస్వినీ వాంగ్మూలం
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో తేజస్విని తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో తేజస్విని తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. శిరీష ఆత్మహత్య తనకు చాలా బాధ కలిగించిందని ఆమె తెలిపారు. ఇంత చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని చెప్పారు. రాజీవ్‌ను తాను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం వాస్తవమేనని, అతని కోసమే తన ఉద్యోగాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నానని చెప్పారు.
రాజీవ్‌తో శిరీష చనువుగా ఉండటంతో అతనితో తాను చాలాసార్లు గొడవపడ్డానని తెలిపారు. ఈ విషయమై శిరీష, తాను పోలీసు స్టేషన్‌లో చాలాసార్లు ఫిర్యాదు కూడా చేసుకున్నామని చెప్పారు. శిరీష వల్లే రాజీవ్ తనను దూరం పెడుతున్నాడన్న అనుమానం కలిగిందని తెలిపారు. రాజీవ్‌కు తెలియకుండా శిరీషతో ఫోన్‌లో చాలాసార్లు గొడవపడ్డానని వెల్లడించారు. రాజీవ్‌ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను అడిగానని చెప్పారు.
శిరీష, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతి కేసులను విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే నిందితులు రాజీవ్, శ్రవణ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో శిరీష-తేజస్విని మధ్య గొడవలు కీలకంగా మారడంతో అసలు వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాజాగా తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించారు.