ఒకటి నాకు.. మరోటి మీ ఇష్టం!

ఒకటి నాకు.. మరోటి మీ ఇష్టం! - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల్లో గుబులు తీవ్రమవుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో పోటీలో దిగడం సర్వత్రా అయోమయానికి దారి తీస్తోంది. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున రెండింటికీ ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫు అభ్యర్థులు, రెబల్స్ చేస్తున్న ప్రచారం ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. దీంతో చివరకు ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనే సందేహం కలుగుతోంది.

 

ప్రచారంలో అభ్యర్థుల వింత పోకడ

 

సాధారణంగా స్వతంత్రంగా బరిలోకి దిగే అభ్యర్థులు తనకోసం ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారు. కానీ ఈసారి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ టికెట్ ఆశించి భంగపడి స్వతంత్రంగా బరిలోకి దిగిన నేతలు ఎమ్మెల్యే కోటా ఓటు తనకు వేసి.. ఎంపీ కోటా ఓటు మాత్రం ఫలానా పార్టీ అభ్యర్థికి వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారం ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వివిధ సంఘాలు సైతం రెండునాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీంతో అటు ఓటర్లు తికమక పడుతుండగా.. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

 

ఇబ్రహీంపట్నంలో శాసనసభ స్థానం నుంచి పోటీచేసిన రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యే ఓటు తనకు వేసి ఎంపీ ఓటు మాత్రం ఫలానా పార్టీకి వేయాలంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

     

రాజేంద్రనగర్‌లో కీలకమైన మైనార్టీ ఓటర్లకు కూడా ఈ తికమక పరిస్థితి తలెత్తింది. ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో ఎమ్మెల్యే కోటా తమ పార్టీకి వేసి.. ఎంపీ ఓటు మాత్రం ఫలానా పార్టీకి వేయాలంటూ ప్రచారం చేయడం గమనార్హం.

     

మహేశ్వరంలో మిత్రబేధానికి పాల్పడిన పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పొత్తులో భాగంగా ఒక పార్టీకి సీటు కేటాయించగా.. చివరకు ఆ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో ఎమ్మెల్యే ప్రచారంలోనే ఇబ్బందులు వచ్చాయి. ఇరువురు అభ్యర్థులు ఒకే ఎంపీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ.. ఎమ్మెల్యే కోటా ఓటు మాత్రం తమకే వేయాలంటూ ఇరువురు అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

     

చేవెళ్ల నియోజకవర్గంలో కూడా జేఏసీ చేస్తున్న ప్రచారం తికమకగా మారింది. ఎంపీ కోటా ఓటు కోసం మాత్రమే ప్రచారం చేస్తున్న నేతలు.. ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రం నచ్చిన వ్యక్తికి వేయాలంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

     

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి మధ్య అంతరం ఏర్పడడంతో ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య సహకారం అంతంతమాత్రంగానే ఉండడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top