ఐదేళ్లలో 33 శాతానికి అడవుల విస్తరణ

ఐదేళ్లలో 33 శాతానికి అడవుల విస్తరణ


* మంత్రి జోగు రామన్న వెల్లడి

* ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూభాగంలో ఇరవై శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. వచ్చే ఐదేళ్లలో 33 శాతానికి విస్తరించాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నేషనల్ గ్రీన్ కార్ప్స్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చెట్లను విపరీతంగా నరికేస్తున్నారని, పర్యావరణకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్టాల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

 

  పర్యావరణానికి నష్టం కలుగకుండా పరిశ్రమలు స్థాపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ములిన్స్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ-చెత్త కారణంగా పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు. సదస్సుకు అధ్యక్షత వహించిన సమాచార మాజీ కమిషనర్, ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నదంతా నాశనమేనన్న ఫ్రెంచి తత్వవేత్త రూసో వ్యాఖ్యలను ప్రస్తావించారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

 

 పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ గ్రీన్ తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. జీవోఐ, జీఈఎఫ్, యూఎన్‌డీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.తులసీరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న 1.75 లక్షల ద్వీపాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వి.సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణలో సేద్యానికి ఉపయోగపడని భూమిని గుర్తించి సిటీకి దూరంగా అక్కడ పరిశ్రమలను స్థాపించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ టి.తిరుపతిరావు మాట్లాడుతూ పర్యావరణ మార్పు న్యూక్లియర్ బాంబు కన్నా అతి పెద్ద శత్రువని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ చైర్‌పర్సన్ లీలాలక్ష్మారెడ్డి ప్రసంగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top