ఇవ్వబోమంటూనే.. ఇచ్చేశారు | Sakshi
Sakshi News home page

ఇవ్వబోమంటూనే.. ఇచ్చేశారు

Published Fri, Mar 27 2015 12:56 AM

ఇవ్వబోమంటూనే.. ఇచ్చేశారు

వెనక్కి ఇవ్వొద్దు... ప్రపంచకప్‌కు ముందు ప్రతీ భారత అభిమాని కోరిక ఇది. ఈ పాపులర్ ప్రకటనలో మన ఆటగాళ్లు కూడా అంతే జోష్‌గా ఇచ్చే సమస్యే లేదు అన్నట్లుగా ఆవేశం ప్రదర్శిస్తుంటారు. కానీ భారత క్రికెటర్లు మాట నిలబెట్టుకోలేదు. లీగ్ దశలో ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని చితక్కొట్టిన ధోని సేన అసలు సమరంలో మాత్రం ఆసీస్‌కు తలవంచింది. సెమీస్ ఒత్తిడిని జయించలేక కుప్పకూలింది.
 
టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 70 వికెట్లు తీసి, ఒక్కసారి కూడా ఆలౌట్ కాని మన బృందం అసలు పోరులో మాత్రం రెండు రకాల వైఫల్యాలనూ చవిచూసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మన బౌలింగ్ తడబడింది. అభేద్యం అనుకున్న బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. ప్రపంచకప్ ఆసాంతం అద్భుతంగా ఆడి అమాంతంగా పెంచేసిన అంచనాలను అందుకోలేక పోరాటం ముగించింది.
 
సాక్షి క్రీడా విభాగం
‘ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మేం ఉన్న స్థితితో పోలిస్తే మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది’...సెమీస్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది.  నిజమే... టెస్టు సిరీస్ కోల్పోవడం, ముక్కోణపు టోర్నీలో ఓటమిలాంటివి చూసిన తర్వాత టీమిండియా ఈ మాత్రం ప్రదర్శన కనబరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై ఎప్పుడూ తడబడే జట్టు వరుసగా ఏడు విజయాలు సాధిస్తుందని కూడా ఆశించలేదు.

అయితే దురదృష్టవశాత్తూ ఒక్క చెడ్డ రోజు జట్టును ఫైనల్‌కు దూరం చేసింది. గతంలో ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటున్నప్పుడు జట్టుపై కాస్త ఒత్తిడి, ఆందోళన కనిపించేవి. కానీ ఈ మ్యాచ్‌కు ముందు మాత్రం ధోని సేన చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించింది.  ఎలాంటి స్థితిలోనైనా పోరాడే పట్టుదల కనబరుస్తూ, వరుస విజయాలు తెచ్చిన జోష్‌తో మన ఆటగాళ్లంతా గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరో మారు కప్పు కొట్టకపోయినా...టోర్నీలో మనోళ్ల ఆటను మాత్రం తక్కువ చేయలేం.
 
బౌలర్లు భేష్...
సుదీర్ఘ కాలంగా మన జట్టు బ్యాటింగ్‌ను నమ్ముకునే విజయాలు సాధించింది. సొంతగడ్డపై స్పిన్నర్ల అండ మినహా మన పేస్ బౌలర్లు మ్యాచ్‌లు గెలిపించిన ఘటనలు చాలా అరుదు. అందులోనూ పెద్దగా అనుభవం లేని పేసర్లు ఏం చేస్తారు అని పెదవి విరిచినవారికి గట్టి సమాధానం ఇచ్చారు. ఈ టోర్నీతో జట్టుకు కలిగిన పెద్ద మేలు పేసర్ల ప్రదర్శనే. ఉమేశ్ యాదవ్, షమీ, మోహిత్‌లు సమష్టిగా కెప్టెన్ వ్యూహాలను సమర్థంగా అమలు చేసి టోర్నీలో సత్తా చాటారు. ఉమేశ్ కేవలం 17.83 సగటుతో 18 వికెట్లు తీస్తే, షమీ 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు.

చివరి క్షణంలో జట్టులో చోటు దక్కించుకున్న మోహిత్‌కు కూడా 13 వికెట్లు పడ్డాయి. వికెట్లే కాదు సరైన సమయంలో కచ్చితత్వంతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం, శుభారంభాలు అందించడం వీరు అలవాటుగా మార్చుకున్నారు. చాలా సందర్భాల్లో 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఉమేశ్ ఎక్కడా 140కి తగ్గలేదు. తమకు అచ్చి రాని పిచ్‌లే అయినా, విదేశాల్లో పేలవ రికార్డు ఉన్నా స్పిన్నర్లు అశ్విన్, జడేజా ప్రదర్శన కూడా చాలా బాగా సాగింది. 13 వికెట్లు తీసిన అశ్విన్ ఎకానమీ 4.28 మాత్రమే ఉండటం అతను బ్యాట్స్‌మెను ఎంతగా కట్టడి చేశాడో అర్థమవుతుంది. జడేజా కూడా కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. జడేజా మినహా మిగిలిన నలుగురు బౌలర్ల ఎకానమీ 5 దాటకపోవడం విశేషం. టోర్నీకి ముందు భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న భువనేశ్వర్ మాత్రం ఒకే మ్యాచ్‌కు పరిమితయ్యాడు.  
 
బ్యాట్స్‌మెన్ ఓకే...

టోర్నీలో ముందుగా బ్యాటింగ్ చేసిన మూడు మ్యాచ్‌లలో 300, 307, 302 పరుగులు చేసిన భారత్ మరో నాలుగింటిలో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించింది. ధావన్, రోహిత్, రైనాల రూపంలో కళాత్మక సెంచరీలు వచ్చినా విధ్వంసకర బ్యాటింగ్ మాత్రం కనిపించలేదు. ఫలితంగా ఒక్క సారి కూడా జట్టు భారీ స్కోరు నమోదు చేయలేదు. అయితే జట్టు విజయాలను ఇది ప్రభావితం చేయలేదు. ఒక ప్రపంచకప్ టోర్నీలో 400కు పైగా పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ (412) నిలిచాడు.

రోహిత్ శర్మ (330), కోహ్లి (305) మూడు వందలకు పైగా స్కోర్లు చేస్తే రైనా, ధోని ఫర్వాలేదనిపించారు. యువ ఆటగాడు రహానే మాత్రం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. అయితే ఎవరో ఒకరు కాకుండా అవసరమున్న ప్రతీ సారి ఒక్కొక్కరు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం వల్ల బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా కనిపించింది.


ఫీల్డింగ్ మెరుగు
‘మా జట్టులో కొంత మంది ఫీల్డర్లను ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు. వారు ఎక్కడ ఉన్నా లేనట్లే’ అంటూ తమ పేలవ ఫీల్డింగ్ గురించి ధోని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ప్రపంచకప్‌లో మన ఫీల్డింగ్ ఒక్కసారిగా పదునెక్కింది. అక్కడ, ఇక్కడ అని కాకుండా మైదానంలో ఎక్కడైనా మనోళ్లు చురుగ్గా కనిపించారు. జడేజా, రైనాలు ఎప్పటినుంచో మంచి ఫీల్డర్లే. కానీ ఈ సారి ప్రతీ ఆటగాడిలో అదే తరహా జోష్ కనిపించింది. రహానే, రోహిత్, ధావన్‌లు కూడా సత్తా చాటారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌ను పెద్దగా లెక్క చేయని పేసర్లు ఉమేశ్, మోహిత్‌లాంటివాళ్లు కూడా పాదరసంగా పరుగెత్తి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. భారత జట్టు ఫీల్డింగ్‌లోనూ, ఫిట్‌నెస్‌లోనూ ఇంత గొప్పగా ఎప్పుడూ కనిపించలేదనేది వాస్తవం.
 
గురి తప్పిన వేటగాడు...
ప్రపంచకప్‌లో అందరి ప్రదర్శన ఒక ఎత్తు అయితే...కోహ్లి ఆట మరో ఎత్తు. జట్టులో జూనియర్‌గా 2011 ప్రపంచకప్ విజయంలో భాగమైన విరాట్ కోహ్లి ఈసారి అసలు హీరో అవుతాడని అంతా ఆశించారు. ఎందుకంటే గత నాలుగేళ్లలో అతని ఆటతో పాటు కీర్తి కూడా అంబరాన్నంటే స్థాయికి చేరింది. కానీ దురదృష్టవశాత్తూ కోహ్లి ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు. బాగానే ఆడాడని, సెమీస్‌లో షాట్‌ను కూడా తప్పు పట్టరాదని ధోని సమర్థించవచ్చు గాక...కానీ కోహ్లి మాత్రం తన పేరుకు తగిన ప్రదర్శన ఇవ్వలేదు.
 
తొలి మ్యాచ్‌లో ధావన్, రైనాలు రెండో వైపు అండగా నిలవగా కోహ్లి సెంచరీ చేసినా, మిగతా టోర్నీ మొత్తంలో ఎక్కడా అతని ముద్ర కనిపించలేదు. వరుసగా విఫలమవుతూ వచ్చినా, సెమీస్‌లో అతనిపై టీమిండియా బాగా ఆశలు పెట్టుకుంది. లక్ష్యఛేదనలో అతని రికార్డు ఆశలు పెంచింది. కానీ కీలక సమయంలో పేలవంగా ఆడి అక్కడే అతను వాటిని వమ్ము చేశాడు.  మొత్తంగా 305 పరుగులు చేసినట్లు కనిపిస్తున్నా...ప్రపంచకప్‌లో కోహ్లి భాగస్వామ్యం పెద్దగా లేదనేది నిజం.

Advertisement
Advertisement