జాతీయవాదంతోనే అధికారంలోకి..

జాతీయవాదంతోనే అధికారంలోకి.. - Sakshi


రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీ సదస్సులో మోదీ

- జాతి ఐక్యతను చాటడంలో తిరంగా యాత్రది కీలక పాత్ర

- అన్ని వర్గాలతో కలసి పనిచేయాలని రాష్ట్ర శ్రేణులకు పిలుపు

- సామాజిక శక్తిగా బీజేపీ అవతరించాలని ఆకాంక్ష

 

 సాక్షి, న్యూఢిల్లీ : జాతీయవాదమే బీజేపీ గుర్తింపు అని, దానికి కట్టుబడి ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగిస్తూ...  జాతీయవాదమే  2014 ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టిందని చెప్పారు. తిరంగా యాత్ర దేశ వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిందన్నారు. వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్న వేళ జాతీయ ఐక్యత, సమగ్రత, సామరస్యాల స్ఫూర్తిని చాటిచెప్పడంలో యాత్ర కీలక పాత్ర పోషించిందని ప్రధాని పేర్కొన్నారు. ‘మనం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. కానీ కొన్ని శక్తులకు అది ఇష్టం లేదు.



ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మన ఏకైక లక్ష్యం జాతి నిర్మాణం అని సామాన్యుడికి చాటి చెప్పాలి. సమాజంలోని అన్ని వర్గాలతో కలిసే పనిచేసేలా క్రియాశీల ప్రయత్నాలు చేయాలి. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆయన నినాదమైన అంత్యోదయను స్మరించుకునేలా పేదల అనుకూల పథకాల్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. వ్యవస్థాగత నిర్మాణంపై ఆధారపడే బీజేపీ రాజకీయాలు కొనసాగించింది. కేవలం రాజకీయ శక్తిగా కాకుండా సామాజిక శక్తిగా కూడా మారేలా మనం ప్రయత్నించాలి’ అని మోదీ చెప్పారు. బీజేపీ నేతలు నిర్మాణాత్మకంగా పనిచేయాలని, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న వ్యూహాల్ని అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మార్చాలని సూచించారు. క్రమశిక్షణతో కలసికట్టుగా సాగాల్సిన అవసరముందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించడంతో పాటు, వివిధ వర్గాలకు చేరువయ్యేలా పని చేయాలన్నారు.



 పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం

 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని రాష్ట్రాల కోర్‌కమిటీ సభ్యులకు సదస్సులో కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. పార్టీని అట్టడుగు స్థాయినుంచి బలోపేతం చేయడంపై, విజయపథంలో నడిపించే విషయంపై సమావేశంలో సుదీర్ఘ సమాలోచనలు చేశారు. కోర్ కమిటీ సభ్యులు ఎలా వ్యవహరించాలి, పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేసేలా ఎలా ప్రోత్సహించాలన్న విధివిధానాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా బూత్ స్థాయి నుంచి ప్రచారం ప్రారంభించాలని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సరైన సమన్వయం ఉండాలని రాష్ట్ర నాయకులకు అధినాయకత్వం సూచించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర పథకాల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 350 మంది పార్టీ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు.



 జాతీయవాదం వల్ల కాదు: కాంగ్రెస్

 మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. మోదీని అధికారంలోకి తెచ్చింది జాతీయవాదం కాదని, ఇంతవరకూ నేరవేర్చని వాగ్దానాల వల్లేనంటూ ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. దేశం కోసం బీజేపీ ఎలాంటి త్యాగాలు చేయలేదని  ఆరోపించారు. ఉదారవాద సంప్రదాయాలు దాడులకు గురవుతున్నాయని తప్పుపట్టారు.

 

 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌కు అమిత్ షా


 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సనం రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే అంశంపై భేటీలో చర్చించామని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే పోలింగ్ బూత్ లక్ష్యంగా సాగుతామని లక్ష్మణ్ చెప్పారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top