ఇదో బుజ్జి గణేశుడి కథ

ఇదో బుజ్జి గణేశుడి కథ - Sakshi


ముంబై:  ఒకవైపు దాద్రి హత్యోందంతో  దేశం అట్టుడికి పోతోంటే ముంబైలో మత సామరస్యానికి అద్దం పట్టే ఘటన చోటు చేసుకుంది. కష్టకాలంలో ఉన్న మైనారిటీ మహిళను ఆదుకొని మానవత్వానికి మతం అడ్డురాదని ముంబై మహిళలు నిరూపించారు. మనుషులంతా ఒక్కటే అని చాటిచెప్పారు.



 ఇల్వాజ్ షేక్  నూర్జహాన్‌ భార్యభర్తలు. ముంబైలో నివసించే ఇల్వాజ్ భార్యకు అనుకున్న సమయాని కంటే ముందుగానే పురుటి నొప్పులు మొదలయ్యాయి. హుటాహుటిన కారులో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళుతుండగా నొప్పులు ఎక్కువయ్యాయి.  అయితే మానవత్వం చూపించాల్సిన  కారు డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి వారిని నడిరోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని భర్త నూర్జహాన్ ను పక్కనే ఉన్న గణేష్ ఆలయంలోకి తీసు కెళ్లాడు.  



దేవాలయం దగ్గర కూర్చొని ఉన్న హిందూ మహిళలు దీన్ని గమనించారు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. నూర్జహాన్‌ను ఊరడించి ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడు చీరలతో ల్యాబర్ రూమును తయారు చేశారు.  అందరూ కలిసి ఆమెకు పురుడు పోసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. దీంతో నూర్జహాన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది.  తన బిడ్డకు గణేశ్ అని పేరు పెట్టుకుంటానని పొత్తిళ్లల్లోని బిడ్డను చూసి మురిసిపోయింది.



అటు పురుడు పోసిన మహిళలు  సైతం 'చిన్ని గోవిందా' అంటూ పసిపిల్లాడిని ముద్దు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. కాగా, బుజ్జి గణేశుడు పుట్టిన సందర్భంగా ఇల్యాజ్, నూర్జహాన్ దంపతులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ఇరుగుపొరుగు సిద్దమవుతున్నారట.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top