హోదాపై సుజనా చౌదరి వింత చేష్టలు


న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. పార్లమెంటు సాక్షిగా మరోసారి ఆ పార్టీ వ్యవహారం బట్టబయలైంది. ఓ పక్క రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగి ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు.



అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. నిన్నటి వరకు కేవీపీ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించిన సుజనా అనూహ్యంగా చేసిన ఈ వింత ప్రవర్తన పలువురికి ఇబ్బంది కలిగించింది. బీజేపీ సభ్యులతో కలిసి బల్లలు చరుస్తూ సుజనా చౌదరి ఉత్సాహంగా కనిపించారు. దీంతో ఆయన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హోదా విషయంలో ఎటూ తేల్చని బీజేపీ సభ్యులతో ఆయన జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఓ పక్క బిల్లుపై ఓటింగ్ కోసం నిరసన చేపడుతుండగానే టీడీపీ ఎంపీలంతా తమకు ఏమీ పట్టనట్లు సభ నుంచి వెళ్లిపోయారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top