‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు | Sakshi
Sakshi News home page

‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు

Published Sat, Mar 24 2018 2:00 AM

CBI arrests promoters of Totem Infrastructure in Rs 1,394 cr fraud case - Sakshi

న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.

టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది.  

డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు
యునైటెడ్‌ ఇండియా ఇన్సూ్యరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(డీసీహెచ్‌ఎల్‌), దాని చైర్మన్‌ టి.వెంకటరామ్‌రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్‌ రేటింగ్‌ లిమిటెడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్‌ కుంజిల్‌వర్‌ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్‌ఎల్‌లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్‌ రేటింగ్‌ లిమిటెడ్‌ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్‌ఎల్‌ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది.

Advertisement
 
Advertisement