జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపివేశారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికులకు ప్రతి స్థాయిలో రక్షణ కల్పించినట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత యాత్రను పునరుద్దరిస్తామని ఆయన వెల్లడించారు. భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి యాత్రికులను జమ్ము నగరంలోకి అనుమతించేది లేదన్నారు. కాగా భద్రత దళాలు అనంతనాగ్లో మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ తో పాటు మరో ఇద్దరిని కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్ నెట్ సేవలను కూడా అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా కశ్మీర్ ప్రాంతంలోని బారాముల్లా నుంచి జమ్ములోని బనిహాల్కు వెళ్లే రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. బుర్హాన్ కాల్చివేతను నిరసిస్తూ జమ్మూకశ్మీర్ వేర్పాటువాదుల నాయకుడు సయ్యద్ అలీ గిలానీ శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ప్రజలందరూ అతని అంత్యక్రియల్లో పాల్గొనాలని కోరారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుల్వామా, షోపిన్, అనంతనాగ్, సొపొర్ తదితర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.