రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష | one minute condition apply for tomorrow's EAMCET in Telangana | Sakshi
Sakshi News home page

రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష

May 14 2016 10:37 AM | Updated on Sep 4 2017 12:02 AM

రేపే ఎంసెట్,  ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష

రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష

రాష్ట్రంలో అగ్రికల్చర్ అండ్ మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15న ఎంసెట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- రేపే ఎంసెట్
- హాజరుకానున్న 2.46 లక్షల మంది విద్యార్థులు
- ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా మిగతా 12 కోర్సులకు మెడికల్ ఎంసెట్
- అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 1,01,014 మంది విద్యార్థులు
- ఇంజనీరింగ్ పరీక్షకు 1,43,516 మంది, రెండింటికీ 1,028 మంది
- 60 వేల మందికిపైగా ఏపీ, ఇతర రాష్ట్రాల వారే
 
సాక్షి, హైదరాబాద్

రాష్ట్రంలో అగ్రికల్చర్ అండ్ మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15న ఎంసెట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 2,46,586 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష రాసేందుకు 1,01014, ఇంజనీరింగ్‌కు 1,43,516 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండూ రాసేందుకు 1,028 మంది దరఖాస్తు చేసుకున్నారు.

గతేడాదితో పోల్చితే ఈసారి ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్య 12 వేలకుపైగా పెరిగింది. గతేడాది 2,32,045 మంది దరఖాస్తు చేయగా.. ఈసారి 2,46,586 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీఫార్మా, బీటెక్ బయో టెక్నాలజీ (బైపీసీ), ఫార్మా-డీ (బైపీసీ), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్‌బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ అగ్రికల్చర్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు.

విద్యార్థులూ జాగ్రత్త!
విద్యార్థులు నిర్ణీత సమయం కన్నా నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. పరీక్ష హాల్లోకి వెళ్లాక ఎగ్జామ్ పూర్తయ్యే వరకు బయటకు పంపరు. పరీక్ష హాల్లోనే విద్యార్థులకు తాగునీటిని అందజేస్తారు. హాల్‌టికెట్లను కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలి. హాల్‌టికెట్ తీసుకురాకపోతే అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ జవాబు పత్రం, పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం పరీక్ష హాల్లోనే అందజేయాలి. లేదంటే వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు. సాధారణ బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ వెంట తీసుకెళ్లాలి. ఫ్యాన్సీ పెన్నులు కూడా అనుమతించరు. ఫోన్లు, క్యాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.

ఏపీ నుంచి పెరిగిన విద్యార్థుల సంఖ్య
తెలంగాణ ఎంసెట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి 60,036 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. తెలంగాణకు చెందిన వారు 1,86,550 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ తేడాది ఏపీ నుంచి 43,169 మంది ఎంసెట్‌కు దరఖాస్తు చేయగా.. ఈసారి 51,144 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణకు చెందిన విద్యార్థులు గతేడాది 9,458 మంది దరఖాస్తు చేయగా.. ఈసారి 8,892 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మెడికల్(రెండూ) పరీక్ష రాసేందుకు తెలంగాణ నుంచి 796, ఏపీ నుంచి 108, ఇతర రాష్ట్రాల నుంచి 124 దరఖాస్తులు వచ్చాయి.

మెడిసిన్‌లో బాలికలే అధికం
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. దీనికి మొత్తంగా 1,01,014 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 35,347 కాగా.. బాలికలు 65,667 మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో బాలురు 89,782 కాగా.. బాలికలు 53,734 మంది ఉన్నారు.

 పరీక్ష కేంద్రాల వివరాలివీ..
(వరంగల్‌లో 1, హైదరాబాద్‌లో 3 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు వీటికి అదనం)

ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రాలు         అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష కేంద్రాలు
 హైదరాబాద్ (8 జోన్లు)94         52
 ఆదిలాబాద్        5                  6
 జనగాం            3                   2
 కరీంనగర్         24               13
 ఖమ్మం          19                 9
 కోదాడ            8                   3
 కొత్తగూడెం        6                  3
 మహబూబ్‌నగర్    7             8
 మెదక్              4                  3
 నల్లగొండ            15            9
 నిజామాబాద్       20          11
 వికారాబాద్        2             2
 వనపర్తి            4                4
 వరంగల్            27            14
 సిద్దిపేట            4               3
 కర్నూలు            4            8
 తిరుపతి            3              8
 విజయవాడ        19          22
 విశాఖపట్నం        8           9
 మొత్తం            276           190

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement