మక్కా మసీదు కతీబ్ కన్నుమూత

మక్కా మసీదు కతీబ్ కన్నుమూత


♦ అనారోగ్యంతో మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ మృతి

♦ కేసీఆర్, చంద్రబాబు, మహమూద్ అలీ సంతాపం

 

 హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమామ్ మౌలానా హాఫేజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ(80) మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ పాతబస్తీ పంచమహాల్లాకు చెందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న పలువురు మత పెద్దలతో పాటు అధికార, అనధికార ప్రముఖులు సంతాపం తెలిపారు. 1935 సెప్టెంబర్ 19న దుండిగల్‌లో జన్మించిన ఆయన గత 24 ఏళ్లుగా మక్కా మసీదు కతీబ్‌గా కొనసాగుతున్నారు. అలాగే జామే నిజామియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పని చేశారు.



ప్రతి శుక్రవారం ఆయన సామూహిక ప్రార్థనల సందర్భంగా మక్కా మసీదులో కుత్బా నిర్వహించేవారు. అల్ హజ్ అబ్దుల్ రహీంకు రెండో కుమారుడైన అబ్దుల్లా ఖురేషీ మెట్రిక్‌లేషన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి, డిగ్రీ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పూర్తి చేశారు. జామే నిజామియా నుంచి ఫజిల్ కోర్సు పూర్తి చేశారు. ‘దావతుల్ ఇస్లామియా అల్ ముసైరా ఫిల్ హిందూ’పై ఎంఫిల్ చేశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్న ఆయన అంత్యక్రియలు బుధవారం జొహర్ కి నమాజ్ అనంతరం మిశ్రీగంజ్‌లో ముగియనున్నాయి.



 కేసీఆర్, బాబు సంతాపం...

 అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మక్కా మసీదు ఇమామ్‌గా, జామియా నిజామియా వైస్ ఛాన్సలర్‌గా ఆయన సేవలను కొనియాడారు. అబ్దుల్లా ఖురేషీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఖురేషీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖురేషీ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఖురేషీ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top