
కళామకాన్
‘లామకాన్’ అంటే ఇల్లు కానిదని అర్థం. ఒకప్పుడు అది ఇల్లే. ఇప్పుడది ఇల్లంటే ఇల్లే కాదు, సకల కళానిలయం.
వైవిధ్యం
‘లామకాన్’ అంటే ఇల్లు కానిదని అర్థం. ఒకప్పుడు అది ఇల్లే. ఇప్పుడది ఇల్లంటే ఇల్లే కాదు, సకల కళానిలయం. మకాన్ అంటే ఒక కుటుంబానికి పరిమితమైపోతుందని భావించారేమో ఆ ఇంటి యజమాని. అందుకే దానికి ‘లామకాన్’గా నామకరణం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లో వెంగళరావు పార్కు సమీపంలోని గల్లీలో ఉంది ఈ సాంస్కృతిక కేంద్రం. వయోభేదాలకు అతీతంగా కళాప్రియులందరూ అక్కడ కనిపిస్తారు. గేటు దాటి లోపలకు అడుగు పెట్టగానే పెద్ద వేదికపై ఒక రచయిత తాను రాసిన పుస్తకం గురించి వివరిస్తుంటాడు.
మరికాస్త లోపలకు వెళ్లగానే ఒక గాయని పిల్లలకు సంగీత శిక్షణ ఇస్తూ కనిపిస్తుంది. మరో గదిలో కార్పొరేట్ చర్చలు సాగుతుంటాయి. ఆ పక్కగదిలో సినీ ప్రేమికుల సిట్టింగులు జరుగుతుంటాయి. క్యాంటీన్ పక్కగా వెళితే కుర్రకారు ముచ్చట్లు వినిపిస్తాయి. కవులు, రచయితలు, కళాకారులు, రంగస్థల, లఘుచిత్రాల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, వ్యాపారవేత్తలు, సాహితీప్రియులు... ఇలా అన్ని రంగాల వారూ ఇక్కడ చేరుకుంటారు. తమ తమ ఆలోచనలను పరస్పరం పంచుకుంటుంటారు. తమ తమ కళలను ప్రదర్శిస్తుంటారు. హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాదు, దేశ విదేశాల కళాకారులు సైతం నిత్యం ఇక్కడకు వచ్చి, తమ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు.
కళాకారుడి కలల మకాన్
లా మకాన్ నిజానికి ఒక కళాకారుడి కలల మకాన్. పెయింటర్, ఫొటోగ్రాఫర్ మొయిద్ హసన్ ఎంతో ముచ్చటగా ఈ ఇల్లు కట్టుకున్నారు. ఆయన సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీ చిత్రాలను కూడా తీసేవారు. మొయిద్ హసన్ జీవించి ఉండగా, ఈ ఇల్లు నిత్యం కళాకారులు, సాహితీవేత్తలతో కళకళలాడుతుండేది. ఆయన మరణానంతరం ఎలాంటి సందడి లేకుండా బోసిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి నచ్చలేదు. అందుకే, కళాకారులకు అందుబాటులో ఉండేలా హసన్ జ్ఞాపకార్థం దీనిని ‘లామకాన్’గా మార్చారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమానికైనా ఫీజులు వసూలు చేయరు.
కొద్దిపాటి ఖర్చుతో కూడిన కార్యక్రమాలకైతే నిర్వహణ ఖర్చు మాత్రమే తీసుకుంటారు. కళాకారులనే కాదు, ఇక్కడకు ఎవరైనా రావచ్చు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లామకాన్ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఇక్కడ వైఫై పూర్తిగా ఉచితం. సోమవారం మాత్రమే దీనికి సెలవు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో అన్నీ చౌకగానే దొరుకుతాయి. ఆకలేసినప్పుడు క్యాంటీన్‌లో కూర్చుని, ఏవైనా తింటూ కబుర్లాడుకోవచ్చు.
కొత్త కళాకారులకు గొప్ప అవకాశం
కళారంగంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికి ‘లామకాన్’ ఒక గొప్ప అవకాశం. నగరంలోని మిగిలిన ఆర్ట్‌గ్యాలరీలు, రంగస్థల వేదికలకు నిర్ణీత మొత్తంలో అద్దెలు చెల్లించక తప్పదు. ‘లామకాన్’లోనైతే నాటకాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, పెయింటింగ్ ప్రదర్శనలు వంటి ఎలాంటి కార్యక్రమాన్ని అయినా ఉచితంగానే నిర్వహించుకోవచ్చు. అయితే, ఇక్కడ ఎలాంటి కార్య క్రమాలకు అనుమతి ఇవ్వాలో వివిధ రంగాల ప్రముఖులు నిర్ణయిస్తారు. హసన్ మేనల్లుడితో పాటు మరో ముగ్గురు ఇక్కడి నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ‘సమాహార’, ‘సూత్రధార’ వంటి నాటక సంస్థలు ‘లామకాన్’ వేదికపై తరచు తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలను ప్రదర్శిస్తుంటాయి. సృజనాత్మకత గలవారందరికీ లామకాన్ ఒక అడ్డా అని ‘సమాహార’ ప్రతినిధి రత్నశేఖర్‌రెడ్డి అన్నారు.
ప్రత్యేక ఆకర్షణ సాయిచంద్ డాక్యుమెంటరీలు
భారతీయ చలనచిత్ర వందేళ్ల వేడుకల సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులపై ప్రముఖ నటుడు, దర్శకుడు టి.సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీలను ఇక్కడ ప్రదర్శించారు. వారానికి ఒకటి చొప్పున పాతిక వారాల పాటు సాగిన ఈ డాక్యుమెంటరీలను పలువురు సినీ ప్రముఖులు సైతం తిలకించారు. వీటిని ప్రదర్శిస్తున్నప్పుడు లామకాన్ ప్రతివారం సినీ అభిమానుల సందడితో కళకళలాడేది.