సీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: వైఎస్ జగన్

సీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: వైఎస్ జగన్ - Sakshi


కడప: రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టును మంగళవారం ఆయన సందర్శించారు.



అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాలను ఒకేలా చూడకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి తాము అడ్డు కాదని... అభివృద్ధి అన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే తమ అభిమతమన్నారు. హైకోర్టును రాజధానిలో కాకుండా మరో జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్థి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం వల్లే గతంలో ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయని, ఇప్పుడు మళ్లీ అలా జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని వైఎస్ జగన్ సూచించారు.



శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందుతాయని, విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడంతో రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పద్మావతి మెడికల్ కాలేజి సీట్లను రాయలసీమ వారికి దక్కకుండా చేశారనే భావన ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కరువు మండలాల ప్రకటన చంద్రబాబు పక్షపాత ధోరణికి నిదర్శనమని, కరువుతో అల్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోయినా, పులివెందుల నియోజకవర్గంలో ఒక్క మండలాన్నే ప్రకటించారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టులు 80 నుంచి 85 శాతం పూర్తయితే.. ఆయన మరణానంతరం 10 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top