తరుముకొస్తున్న వార్దా | vartha effect | Sakshi
Sakshi News home page

తరుముకొస్తున్న వార్దా

Dec 11 2016 10:24 PM | Updated on Sep 4 2017 10:28 PM

తరుముకొస్తున్న వార్దా

తరుముకొస్తున్న వార్దా

తుపాను ప్రభావం వల్ల జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌ మాసూళ్ల పనుల్లో నిమగ్నమైన రైతులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

పెరిగిన గాలుల ఉధృతి 
పొంచి ఉన్న భారీవర్షాలు
రైతుల ఆందోళన 
అధికారులు అప్రమత్తం  
 
ఏలూరు (మెట్రో) : తుపాను ప్రభావం వల్ల జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌ మాసూళ్ల పనుల్లో నిమగ్నమైన రైతులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రికి మచిలీపట్నానికి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను సోమవారం మధ్యాహ్నానికి నెల్లూరు, సూల్లురుపేటల మధ్య తీరం దాటనుందని, దీనిప్రభావం వల్ల జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలుల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గాలుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో రెండులక్షల ఎకరాల్లోని వరి పంట మాసూళ్ల దశలో ఉంది. లక్ష ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. భారీవర్షాలు కురిస్తే ఆక్వా, వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. గాలులకు కోతకొచ్చిన చేలు వాలిపోయే ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండురోజులుగా త్వరగా మాసూళ్లు పూర్తిచేసుకోవాలని, పంటను ఇంటికి చేర్చుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. లోతట్లు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. వరుస సెలవుల వల్ల అధికారులెవరూ దూరప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.  వ్యవసాయశాఖాధికారులు ఆదివారం కూడా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  
19సెంటీమీటర్ల వర్షానికి అవకాశం 
తుపాను ప్రభావం వల్ల 19 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. శీతాకాలం కావడంతో ఈదురుగాలుల వల్ల చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.   
ఇతర జిల్లాలకు మన పోలీసులు 
ఇప్పటికే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలను వాతావరణ శాఖ గుర్తించింది. దీంతో ఆ జిల్లాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మన జిల్లా పోలీసులను పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి సహాయక చర్యలకు ఇతర శాఖల అధికారులనూ పంపనున్నట్టు సమాచారం.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement